దోమ, జనవరి 3 : మోత్కూర్ పీఏసీఎస్ నూతన చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో వర్గపోరు భగ్గుమన్నది. శుక్రవారం పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా దోమ మండల కేంద్రంలో ఉన్న మోత్కూర్ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట, పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలలో తమ నాయకుల ఫొటోలు లేవంటూ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం ఆందోళనకు దిగింది. పోలీసులు చూస్తుండగానే ఫ్లెక్సీలను చించివేయడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా, ఈ గొడవ కాస్త హైకోర్టు వరకు వెళ్లింది. 13 మంది డైరెక్టర్లలో 10 మంది డైరెక్టర్లు మద్దతు తెలుపడంతో నూతన చైర్మన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన వర్గపోరు అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో చైర్మన్‌గా ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకరించిన డైరెక్టర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమం తరువాత దోమ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీచర్స్ ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీవో నాగలింగాచారి, సీఈవో యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, డైరెక్టర్లు, యువ నాయకులు శాంతకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్యగౌడ్, మొగులయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటేసి గెలిపిస్తే అరెస్ట్ చేయిస్తారా.. అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ తర్వాత మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీనియర్ నాయకుల ఫొటోలు లేకపోవడం బాధాకరమన్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యత్యాసాలు చూపడం సరికాదని, కాంగ్రెస్‌లో వర్గపోరు కుంపటి మంచిది కాదని, ఎమ్మెల్యేను కలిసి చెబుదామని వెళ్తున్న తమను అరెస్టు చేయించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకిగాని, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి గాని తాము మద్దతు తెలుపబోమని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ దోమ గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్, బాబు, షబ్బీర్, యాదగిరి, నవీన్‌కుమార్‌రెడ్డి, జావీద్, రవి తదితరులు ఉన్నారు.