రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో మత్స్యకార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపడుతుండగా.. ఈసారి ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదార్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ఈ నెల 13 వరకు గడువు పెంచింది. చెరువుల్లో చేప పిల్లల విడుదలకు సమయం ఆసన్నమవుతుండగా.. ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండడంతో జిల్లాలో చేపల విక్రయాలతోనే ఉపాధి పొందుతున్న 9,136 మత్స్యకార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 978 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 186 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఈ సంఘాల్లో 9,136 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 2016-17లో కేసీఆర్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొదటి సంవత్సరం 25 లక్షల చేప పిల్లలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏడేండ్లుగా విజయవంతంగా సాగింది. గడచిన ఏడేండ్లలో 6.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేయగా.. ఇందుకుగాను రూ.4.40 కోట్ల వరకు నిధులను వెచ్చించింది. ఈ మేరకు 41,753 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో రూ.56.59 కోట్ల ఆదాయం ఒనగూరింది.
జలాశయాల్లో ఉచితంగా వదులుతున్న బొచ్చ, రాహు, బంగారు తీగ, రొయ్య, ముల్లంగి తదితర చేపలతో మత్స్యకార్మికులు ఏడాది పొడవునా ఉపాధిని పొందుతూ వస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన చేపలు ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతి అవుతుండగా.. మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్ సౌకర్యం సైతం కల్పించారు. చేప పిల్లలను వేటాడేందుకు వలలు, రవాణా కోసం ద్విచక్ర వాహనాలు, టీవీఎస్ చాంప్ మోపెడ్లు, లగేజీ ఆటోలు, బొలేరో వాహనాలను అందజేశారు. అలాగే మహిళా సహకార సంఘాలకు రుణాలను సైతం విరివిగా అందించడంతోపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లను నిర్వహించి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన భరోసాతో జిల్లాలో ఒక్కో మత్స్యకార్మిక సభ్యుడికి కేవలం చేపల విక్రయాల ద్వారానే సగటున రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు పైగానే లబ్ధి కలిగింది.
చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో సకాలంలో చేప పిల్లలను పంపిణీ చేస్తారా? లేదా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా చేప పిల్లల పంపిణీని జూలైలోనే కంప్లీట్ చేసేవారు. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆగస్టు మొదటి వారంలో ఈ తంతు పూర్తి చేసేవారు. ఇందుకుగాను ప్రభుత్వం ఏప్రిల్ మాసం నుంచే సన్నాహాలు మొదలు పెట్టేది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80ఎంఎం నుంచి 100ఎంఎం సైజు చేప పిల్లలను.. చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35ఎంఎం నుంచి 400ఎంఎం సైజులో ఉండే చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసేది. అయితే ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల చేప పిల్లల పంపిణీ సైతం ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన చేపల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా! అన్న సందిగ్ధత తొలుత నెలకొన్నది. తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి జిల్లాలో 813 చెరువుల్లో 1.93 కోటి చేపపిల్లలను వదిలేందుకు సంకల్పించింది. ఈ మేరకు అధికారులు గత జూలై 10న టెండర్లు పిలిచారు. గుత్తేదార్లు టెండర్ వేసేందుకు ముందుకు రాకపోవడంతో గడువును 23వ తేదీకి పెంచారు. అయినప్పటికీ గుత్తేదార్ల నుంచి స్పందన లేకపోవడంతో గడువును ఆగస్టు 13కు మరోసారి పెంచారు.
గత ఏడాది జిల్లాలో సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. ఈ కారణంగానే గుత్తేదార్లు టెండర్లో పాల్గొనడం లేదని తెలుస్తున్నది. జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొంతమేర వరద చేరింది. చేప పిల్లల విడుదలకు ఇదే అనువైన సమయం. అయితే ఆలస్యంగా చేప పిల్లలను వదలడం వల్ల చేపలు ఎదగడానికి ఆలస్యమై మత్స్యకార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యకార్మికులు కోరుతున్నారు.