రంగారెడ్డి, మే 20(నమస్తే తెలంగాణ) : ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నా.. మే నెల పూర్తి కావొస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ టెండర్ల దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ అనుసరించి జిల్లా స్థాయిలో అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇంకా సర్కారు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. చేపపిల్లల పంపిణీతో జిల్లాలో ఉపాధి పొందుతున్న 8,221 మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జిల్లాలో 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 చెరువులున్నాయి. వీటి పరిధుల్లో 161 మత్స్య పారిశ్రామిక సహకర సంఘాలుండగా.. అందులో 8,221 మంది సభ్యులుగా ఉన్నారు. 2016-17లో కేసీఆర్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొదటి ఏడాది 25 లక్షల చేప పిల్లలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏడేండ్లుగా విజయవంతంగా సాగింది. గడిచిన ఏడేండ్లలో 6.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేయగా.. ఇందుకోసం రూ.4.40 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ మేరకు 41,753 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో రూ. 56.59 కోట్ల ఆదాయం సమకూరింది.
జలాశయాల్లో ఉచితంగా వదులుతున్న బొచ్చ, రాహు, బంగారు తీగ, రొయ్య తదితర చేపలతో మత్స్యకారులు ఏడాది పొడవునా ఉపాధి పొందారు. ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేశారు. చేప పిల్లలను వేటాడేందుకు వలలు, రవాణాకోసం ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను ప్రభుత్వం అందజేసింది. అలాగే మహిళా సహకార సంఘాలకు విరివిగా రుణాలను అందించడంతో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వ హించి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన భరోసాతో జిల్లాలో ఒక్కో మత్స్యకారుడు చేపల విక్రయాల ద్వారానే సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా లబ్ధి పొందాడు.
చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియను చేపట్టకపోవడంతో ఇన్‌టైంలో చేప పిల్లలను పంపిణీ చేస్తారా?.. లేదా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా చేప పిల్లల పంపిణీని జూలైలోనే ముగించేవారు. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆగస్టు మొదటి వారంలో ఫినిష్ చేసేవారు. ఇందుకుగాను ప్రభుత్వం ఏప్రిల్ నుంచే సన్నాహాలు మొదలుపెట్టేది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80ఎంఎం నుంచి 100ఎంఎం సైజు చేప పిల్లలను..
అదేవిధంగా చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35ఎంఎం నుంచి 400 ఎంఎం సైజులో ఉండే చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసేది. అయితే ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఆలస్యమ య్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి త్వరగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.