రంగారెడ్డి, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. బదిలీల కోసం జిల్లా వ్యాప్తంగా 4,722 దరఖాస్తులు విద్యాశాఖకు అందాయి. ఇందులో గతంలో 4,194 మంది దరఖాస్తు చేసుకోగా.. 316 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. మరో 212 మంది ఎటువంటి ఎడిట్ ఆప్షన్ లేకుండా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 6,919 మంది ఉపాధ్యాయులు ఉండగా.. 5-8 సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్లో వెల్లడించిన ప్రకారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) బదిలీలకై 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారితోపాటు మిగిలిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి బదిలీలు నిర్వహించగా మంగళవారమే ఆయా పాఠశాలలకు వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు.
జిల్లాలో 168 జీహెచ్ఎం పోస్టులకు గాను 148 పోస్టులు బదిలీ ప్రక్రియలో భర్తీ అయ్యాయి. మిగిలిన 17 ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్‌ఎంకు అర్హత ఉండి పదోన్నతులకై సిద్ధ్దంగా ఉన్నవారి తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన ప్రక్రియ సైతం పూర్తవ్వగా.. గురువారం వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 22న ఎడిట్ ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆతర్వాత 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. అక్టోబర్ 3వ తేదీ వరకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి కానున్నది. సంవత్సరాల తరబడి బదిలీలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల్లో ప్రస్తుత బదిలీలు సంతోషాన్ని నింపుతున్నాయి.