Field Assistants | కులకచర్ల, మే 1 : ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంబు వెంకటయ్య పేర్కొన్నారు. గురువారం కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామకృష్ణకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకంలో కీలకంగా పనులు నిర్వహిస్తూ జీతాలు సక్రమంగా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ముఖ్యంగా తమ సంస్థలో పనిచేస్తున్న కొంత మందికి ఎఫ్టీఈగా ప్రభుత్వం గుర్తించిందని తమకు కూడా ఎఫ్టీఈగా గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దీనికి గాను తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. జీతాలు కూడా ప్రతి నెల సకాలంలో రాక కుటుంబాలను పోషించుకునే స్థోమత కూడా లేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు కనీసం 25 వేల వేతనం చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్‌కార్డులను ఇవ్వాలని, విధినిర్వహణలో మరణించిన కుటుంబాలకు 15 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. ఫిబ్రవరి నుండి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు రఘురాములు, మహిళా అధ్యక్షురాలు అనితారెడ్డి, వివిద గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.