ఆమనగల్లు, జూన్ 3 : విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి డీలర్లను హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని ఆకుతోటపల్లి గేట్, ముర్తూజపల్లి గేట్, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో పలు ఫర్టిలైజర్, సీడ్స్, పెస్టిసైడ్ డీలర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఏవో మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువుల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ బలరాం నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్, డీలర్లు నరేశ్‌రెడ్డి, మల్లేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ మండలం చేగూరు గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులను సోమవారం వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ నాయక్, నందిగామ ఎస్ఐ గోపాల కృష్ణ డిప్యూటీ తహాసీల్దార్ తో కలిసి పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం గుర్తింపు ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలను రైతులు కొనుగోలు చేయాలని, విత్తనాల కొనుగోలు రసీదును పంటలు చేతికి వచ్చే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.