జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బుల చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఐదారు రోజుల్లోనే అన్నదాతలకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించినా.. నెల రోజులు దాటినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం తదితర కారణాలతోనే చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు (రూ. 464 కోట్ల విలువ) 62,403 మెట్రిక్ టన్నుల పత్తిని రైతుల నుంచి సేకరించి రూ.171 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో సీసీఐ జమ చేసింది. మరో రూ.293 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా జిల్లాలో ఈ ఏడాది 2,40,000 ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. 2,00,000 మెట్రి క్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
– వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
అంచనాలకు మించని సేకరణ..
అన్నదాతల నుంచి పత్తిని సేకరించేందుకు జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తాండూరులో మారుతి, శుభం, బాలాజీ, కోట్‌పల్లిలో సాయిబాబా కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్, పరిగిలో లక్ష్మీవేంకటేశ్వర, నరసింహ, రాకంచర్ల కాటన్‌మిల్లు, వికారాబాద్‌లో ధరణి, సాయిబాబా, అయ్యప్ప జిన్నింగ్ మిల్లు, మర్పల్లిలో శ్రీ అయ్యప్ప కాటన్ ట్రేడర్స్, కొడంగల్‌లో విజయ్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 2,00,000 మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు 62,403 మెట్రిక్ టన్నుల పత్తిని 25,328 మంది రైతుల నుంచి సేకరించారు. అయితే పత్తిని విక్రయించిన రైతులు డబ్బుల కోసం సీసీఐ కేంద్రాల చుట్టూ పడిగాపు లు గాస్తున్నారు. నెలరోజులు దాటుతున్నా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో.. మిగిలిన రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాల్లో కాకుండా మధ్యదళారులు, వ్యాపారులకు రూ. 100 తక్కువైనా విక్రయిస్తుండడం గమనార్హం. కాగా జిల్లాలో ఏర్పాటైన 14 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే ఎనిమిది సెంటర్లను అధికారులు మూసేశారు. వికారాబాద్‌లోని ధరణి, సాయిబాబా అగ్రోటెక్, అయ్యప్ప కాటన్‌మిల్లు, పరిగిలోని రాకంచర్ల కాటన్‌మిల్, శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఇండస్ట్రీస్, మర్పల్లిలోని అయ్యప్ప కాటన్ ఇండస్ట్రీస్, ధారూరులోని సాయిబాబా ఆగ్రో కామడిటిస్, కోట్‌పల్లిలోని మంగళం కాటన్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ప్రక్రియ రెండు రోజుల కిందటి నుంచే నిలిచిపోయింది.
త్వరగా చెల్లింపులు జరిగేలా చర్యలు..
పత్తిని విక్రయించిన రైతులకు త్వరగా చెల్లింపులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. సీసీఐ నుంచి డబ్బులు రావాల్సి ఉండడంతోపాటు రైతుల ఆధార్ కార్డులు లింక్ కాకపోవడం వంటి కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది.
– సారంగపాణి, వికారాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి