వికారాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నెల రోజులుగా సరిపడా స్టాక్ ఉందని చెబుతున్నా రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం అరిగోస పడుతున్న రైతులకు మద్దతు తెలిపి.. వాస్తవాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు మద్దతు తెలిపి రాస్తారోకోలు, ధర్నాలు చేసిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులతో సర్కార్ కేసులు పెట్టించింది. వారం రోజులుగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా లు, రాస్తారోకోలు చేస్తున్నారు.
జిల్లాలోని వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో యూరియా కోసం బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో వారం రోజులుగా రోజుకొక మం డలంలో యూరియా కోసం బా రులు తీరిన రైతులతో మాట్లాడి.. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలుపుతూ మద్దతునిస్తున్నారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రైతుల పక్షాన ధర్నా చేశారు.
రైతులకు సరిపడా యూరియాను అందించలేని కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ నేతలపై కక్షతో కేసులు పెట్టించింది. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైతుల కోసం పోరాడితే కేసులు పెట్టడం ఏమిటని.. కేసులకు భయపడేది లేదని, రైతుల సమస్యలపై పోరాటా న్ని ఆపేదిలేదని మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అణగదొక్కాలనుకుంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతారని ఆయన హెచ్చరించారు.
అందుబాటులో 830 మెట్రిక్ టన్నుల యూరియానే..
రైతులకు యూరియా గోస తప్పడం లేదు. గత పదిహేను రోజులుగా జిల్లాలోని రైతులు ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేట్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, రైతుభరోసా అందించడంలో మోసం చేయడంతోపాటు.. అన్నదాతలకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలోనూ పూర్తిగా విఫలమైంది. సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు వ్యవసాయ పనులను వదులుకొని యూరి యా కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది.
యూరి యా పంపిణీ కేంద్రాలు తెరుచుకోకముందే ఉదయం 6 గంటల నుంచే అక్కడ నిరీక్షిస్తున్నారు. వృద్ధులు, యువత అనే తేడా లేకుండా అందరూ అక్కడ పడి గాపులు కాస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలూ చేస్తున్నారు. వ్యవసాయాధికారులు జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా .. వారు అధికారికంగా ఇచ్చే స్టాక్ నిల్వలను చూస్తే ఎక్కడా యూ రియా స్టాక్ లేదనే విషయం తెలుస్తున్నది. సరిపడా ఉంటే మమ్మల్ని ఎందుకు రోజుల తరబడి క్యూలో ఉంచుతున్నారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో సాగు చేసిన పంటలకు 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 20,000 మెట్రిక్ టన్నులే సరఫరా కాగా.. ప్రస్తుతం జిల్లాలో కేవలం 830 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద 640 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ కేంద్రాలు, ఎఫ్ఎస్సీఎస్ కేంద్రాలు, ఆగ్రో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రా లు, ఎఫ్‌పీవో కేంద్రాల్లో కలిపి కేవలం 190 మెట్రిక్ టన్నులే ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 190 మెట్రిక్ టన్నుల యూరియాను క్యూలో నిల్చున్న రైతులకు అందిస్తే గంటలోపే అయిపోతుందని రైతు నాయకులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద 640 మెట్రిక్ టన్నుల యూరియా ఉండగా వారు దానిని విక్రయించకుండా బ్లాక్ చేస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని రైతులు, రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాను రూ.270-రూ. 280లకు విక్రయించాల్సి ఉండగా, కొందరు ప్రైవేట్ డీలర్లు రూ.350-రూ.400ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేట్ డీలర్లపై నిఘా పెట్టాల్సిన వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.