రంగారెడ్డి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఖరీఫ్‌లో పంటలను సాగుచేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. 1,25,000 ఎకరాల్లో వరి, 1,34,000 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అన్నదా తలు ఈసారి గతంలో కంటే అధికంగా పంటలను సాగు చేశారు. కాగా, పంటలకు అవసరమైన యూరియా సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువుకోసం నెలరోజులుగా రోడ్డెక్కుతున్నా అవసరం మేరకు అందని దుస్థితి నెలకొన్నది. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో యూరియా కోసం రైతులు నేటికీ సహకార సంఘాల ఎదుట క్యూ కట్టుతున్నారు.
జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో వరి, పత్తి పంటలకు ముప్పు పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో సాధారణం కంటే రెండింతలు అధికంగా వర్షపాతం నమోదయ్యింది. పత్తిపంటలో వర్షపునీరు చేరి ఆకులు పచ్చబారుతున్నాయని రైతు లు పేర్కొంటున్నారు. మాడ్గుల, యాచారం, తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు, షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు తదితర మండలాల్లో రైతులు పత్తి పంటను అధికంగా సాగుచేశారు. ఈ సారి ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని ఆశిస్తుండగా.. ఈ నెలలో వానలు అధికంగా కురుస్తుండడంతో అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం కలుగుతున్నదని రైతు లు వాపోతున్నారు.
Floods
జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూరగాయలతోపాటు ఆకుకూరలు, టమాట పంటకు పెద్ద ఎత్తు న నష్టం జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. కూరగాయల సాగు కోసం రూ. లక్షల ఖర్చు పెట్టామని పంట చేతికొచ్చే సమయం లో అకాల వానలతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.