రంగారెడ్డి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో వర్షాకాలంలో వేసిన వరి పంటల కోతలు ఆరంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం మాత్రం మొక్కుబడిగా సాగుతున్నది. కాని, అదును దాటిపోతున్నా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకే మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఎక్కడా అమలు జరగడంలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం జిల్లావ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించగా.. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 4, ఐకేపీ ఆధ్వర్యంలో 10, సహకార సంఘాల ఆధ్వర్యంలో మరో 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాని, అధికారుల అంచనాలకు క్షేత్రస్థాయిలో కొనుగోలుకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. ఇప్పటివరకు మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడ సరిగ్గా కొనుగోలు జరగడంలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకే దళారులకు విక్రయిస్తున్నారు. గత సంవత్సరం కూడా అదును దాటిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అన్నదాతలకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
ఆర్భాటంగా ప్రారంభం
ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాని, మరుసటి రోజే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ఎండబెట్టారు. కాని, కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు తిరిగి ఆ వడ్లను ఇండ్లకు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పనిచేయడంలేదు. గత ఏడాది విక్రయించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో అన్నదాతలకు కొనుగోలు కేంద్రాలపై నమ్మకం సన్నగిల్లుతున్నది.
సకాలంలో కేంద్రాలు ఏర్పాటు చేయాలి
వరిధాన్యం సకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలి. ధాన్యం రోడ్లపై, కళ్లాల్లో మూలుగుతున్నది. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు
ఎక్కడికక్కడే రోడ్లపై ధాన్యం రాశులు
సర్కారు ప్రకటించిన విధంగా మద్దతు ధర రావాలంటే ధాన్యం ఎండబెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో గ్రామాల్లో రైతులు ఎక్కడికక్కడ రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబెట్టారు. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డులో ఎక్కడ చూసినా వడ్లు ఎండబోసి ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో అన్నదాతలు వీటిని విక్రయించుకోలేకపోతున్నారు.