Shabad | షాబాద్, మే 23 : రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, శీరిషా అన్నారు. శుక్రవారం ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్తవేత్తలు కార్యక్రమాన్ని షాబాద్ మండలంలోని ఏట్ల ఎర్రవల్లి, హైతాబాద్ గ్రామాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో సమగ్ర, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామంలో పండిస్తున్న వరి, పత్తి, కందులు, మొక్కజొన్న పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. వరి, కంది, మొక్కజొన్న పంటలలో నూతన వంగడాల గురించి రైతులకు సమగ్రంగా వివరించారు. టమాట పంటలో వైరస్ వ్యాపిస్తే నివారణను గురించి రైతులకు వివరించారు. సాగు ఖర్చు తగ్గించి, నేల తల్లి ఆరోగ్యం కావాలని సూచించారు.
ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో పండిస్తున్న ప్రధాన పంటల మార్కెటింగ్ గురించి, రైతు సమాఖ్య సంస్థలను స్థాపించి వారు పండిస్తున్న పంటలను లాభసాటిగా అమ్ముకోవాలని చెప్పారు. రైతులు పంటలకు ఎరువులను, పురుగుమందులను అవసరం మేరకే ఉపయోగించాలని సూచించారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శీరిషా మాట్లాడుతూ.. పంటలకు యూరియా తక్కువగా వాడాలని, ఒకేసారి కాకుండా దఫా దఫాలుగా వేసుకోవాలన్నారు. అవసరం మేరకే మాత్రమే రసాయనాలు వినియోగించాలన్నారు. రైతులు విత్తనాలు, పురుగు మందులు కొన్న రశీదులు భద్రపరుచుకోవాలని, పంట మార్పిడి విధానాన్ని పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త అర్చన, రిసర్చ్ స్కాలర్ అవనిజ, ఏఈఓలు రాజేశ్వరి, కిరణ్మయి, వ్యవసాయ విశ్వవిదాలయం విద్యార్థులు ప్రవీణ్‌కుమార్, శివ, రైతులు మాణిక్యరెడ్డి, శశికాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.