మంచాల డిసెంబర్ 13 : మండల పరిధిలోని జాపాల గ్రామంలో కూరగాయలు, ఆకుకూరల సాగు చేసుకొని రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. జాపాల, అస్మత్పూర్ గ్రామాల్లో ఉన్న సన్న, చిన్నకారు రైతులు తమకున్న ఎకరా, అర ఎకరా పొలాల్లో వరికి బదులుగా కొత్తిమీర, పుదీనా, పాలకూర, కొయికూర, తోటకూరతో పాటు టమాట, బెండ, చిక్కుడు, బీరకాయ పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రతి రైతు ఆరుతడి పంటలతో పాటు పాడి పశువులతోనూ ఆదాయం పొందుతున్నారు. జాపాల గ్రామంలో 350 ఇండ్లు ఉండగా, సగం మందికి పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి ఆకుకూరలు, కూరగాయల పంటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. జాపాల, అస్మత్పూర్ గ్రామాల్లో 250 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. ఉదయాన్నే ఆకుకూరలు తెంపి ఆటోల్లో నగరానికి తరలించడమే కాకుండా నేరుగా మార్కెట్లో విక్రయించి లాభాలను పొందుతున్నారు. నగరానికి జాపాల, అస్మత్పూర్ గ్రామాలు అతి దగ్గరగా ఉండడంతో ఎల్బీనగర్, మాదన్నపేట్, కొత్తపేట్ మార్కెట్లతో పాటు బీఎన్‌రెడ్డి మార్కెట్‌కూ ఆకుకూరలు, కూరగాయలు తెచ్చి అమ్ముకుని తిరిగి తొమ్మిది గంటల వరకల్లా ఇంటికి చేరుకుంటున్నారు.
నిత్యం రూ. 5వేల ఆకుకూరలను తీసుకెళ్తా..
నిత్యం రూ.5వేల విలువ చేసే ఆకుకూరలను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తా. తొమ్మిది, పది గంటల వరకల్లా మొత్తం అమ్ముకుని తిరిగి ఇంటికి వెళ్తా. తాజా ఆకుకూరలు కావడంతో మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాదంతా ఆకుకూరలే సాగు చేస్తాం. ఆకుకూరల పంటల సాగుకు ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ.
ఆరుతడి పంటలతోనే లాభాలు..
ఆరుతడి పంటలతోనే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. 5ఎకరాల పొలంలో టమాట, బీరకాయ, బెండకాయతో పాటు ఆకుకూరలను సాగు చేశా. పండించిన పంటను కొత్తపేట మార్కెట్‌కు తీసుకెళ్తా. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆకుకూరలు, కూరగాయలను విక్రయిస్తా. పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి..
యాసంగి సీజన్లో ప్రతి రైతు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. సాగు విషయంలో ఎలాంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదిస్తే నివృత్తి చేస్తాం. వరికి బదులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టి లాభాలు పొందాలి. ఈ ఏడాది ఆకుకూరలతో పాటు సజ్జలు, పెసర్లు, కంది వంటి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.