బ్రహీంపట్నం, జూలై 10 : రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులకు వ్యవసాయ గుర్తింపు కార్డుల ప్రక్రియ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతున్న విషయం తెలుసుకున్న ఆయన.. బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్న రైతులకు వ్యవసాయ గుర్తింపు కార్డుల ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పరిశీలించి వ్యవసాయాధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఉండాలన్న ఉద్దేశంతో గుర్తింపు కార్డుల ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రేవంత్రెడ్డి సర్కారుకు రైతులపై ఎలాంటి చిత్తశుద్ధి లేక కేవలం ఒక్క ఏఈవోకు మాత్రమే లాగిన్ ఇవ్వడంతో ప్రతిరోజూ ఏఈవో సుమారు 50 వరకు లాగిన్ చేస్తున్నారని, ఒక్క ఏఈవో క్లస్టర్లో సుమారు 18000 మంది రైతులున్నారని, ప్రతిరోజూ 50 పూర్తయితే వీరందరికి ఎప్పుడు పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్వర్, ఉప్పరిగూడ మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులున్నారు.