యాచారం, జూన్ 5 : మండలంలోని మొండిగౌరెల్లిలో ఉన్న ప్రభుత్వ భూములను ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అధికారులు, గ్రామస్తులతో కలిసి గురువారం పరిశీలించారు. గ్రామంలోని సర్వేనంబర్లు 19, 68, 127లలో ఆయన పర్యటించి పరిశీలించి.. వాటి వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ భూములను సేకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, అంజయ్యయాదవ్, రవీందర్, యాదగిరిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆర్డీవోకు విన్నవించారు. తాతల కాలం నుంచే ఆ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని.. పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని వాటిని త్వరగా అందించాలని కోరారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం భూములను సేకరించొచ్చునని.. రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు ఉన్నారు.