వికారాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రూ. లక్షన్నర లోపు రుణమాఫీ కాలేదంటూ వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం మొదలుకొని క్షేత్రస్థాయిలో ఏఈవోల వరకు రైతులు వేలాదిగా తరలివచ్చి రుణమాఫీ కాలేదంటూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు, షరతులు పెట్టి కొంతమందికే రుణమాఫీ చేయడంతో… అర్హులమైనా మా రుణాలు ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల సంఖ్య వేలాదిగా ఉండడంతో కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలోని టెక్నికల్ సెక్షన్, మండల వ్యవసాయాధికారి కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా ఏఈవోలు బాధిత రైతుల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటివర కు వికారాబాద్ జిల్లాలో 1,700 మంది రైతులు తమకు రూ.లక్షన్నర లోపు రుణాలున్నా మాఫీ కాలేదని విన్నవించినట్లు అధికారులు చెబుతుండగా..
అనధికారికంగా ఈ సంఖ్య ఐదువేల పైగానే ఉంటుందని సమాచారం. గత రెండు రోజుల్లో 500 మంది రైతులు రూ.లక్షన్నర లోపు రుణాలు న్నా మాఫీ కాలేదంటూ వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేయగా.. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వెయ్యికిపైగా ఫోన్‌కాల్స్ ద్వారా విజ్ఞప్తులొచ్చాయి.
కాగా వ్యవసాయాధికారులు రేషన్ కార్డు లేకపోవడంతో పలువురు రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవడంలేదని సమాచారం. కేవలం అండర్ ప్రాసెస్ ఉన్న విజ్ఞప్తులను మాత్రమే స్వీకరించి, త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకొని వేలాది మంది అన్నదాతలకు రుణమాఫీ వర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిం దని రుసరుసలాడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.రెండు లక్షల వరకు రైతుల పంట రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి గద్దె ఎక్కగానే మాట మార్చారని.. కొర్రీలు, షరతులు పెడుతూ వేలాది మందికి మాఫీ వర్తించకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
రుణమాఫీతో బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల భారం తప్పుతుందని.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని భావించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకుల్లోని అప్పులను చెల్లించేందుకు మళ్లీ ప్రైవేట్, వడ్డీ వ్యా పారులను ఆశ్రయించాలని దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా జిల్లాలో రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకొని రూ.లక్షన్నర రుణమాఫీ ప్రక్రియ చేపట్టడంతో కేవలం 73,000 మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. అదే పట్టాదారు పాసుపుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్తైతే లక్షన్నరకుపైగా రైతులకు ప్రయోజనం చేకూరేది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో రూ. లక్ష రుణమాఫీతో లక్షా20 వేల మంది రైతులకు లబ్ధి చేకూరడం గమనార్హం.
నమ్మించి మోసం చేస్తున్నది..
ప్రభుత్వం షరతులు పెట్టి అన్నదాతలకు అన్యాయం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికా రంలోకి రాగానే మాటమార్చడం తగదు. రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయడం ద్వారా వేలాది మంది రైతులకు మాఫీ వర్తించడం లేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకు రుణాలను చెల్లించేందుకు అన్నదాతలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాలని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి మోసం చేస్తున్నది..
-కుర్వ భిక్షపతి , రైతు, నాగులపల్లి గ్రామం, పెద్దేముల్
కొర్రీలతో అన్నదాతల పరిస్థితి ఆగమాగం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు విడతల వారీగా చేయడం విడ్డూరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో ఓ రకంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజనం. బ్యాంకులో నా పేరుతో రూ.1,26,000 క్రాప్ లోన్ ఉన్నది. అర్హుడిని అయినా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. రుణమాఫీ చేస్తున్నమని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తున్నది. కొర్రీలు పెట్టి అన్నదాతలను ఇబ్బంది పెట్టడం సరికాదు..
-రవి, రైతు, బండపల్లి గ్రామం, పెద్దేముల్
అర్హులకు అన్యాయం..
నాకు రెండెకరాల 12 గంటల భూమి ఉన్నది. నా పేరుతో బ్యాంకులో రూ.లక్ష లోపు క్రాప్ లోన్ ఉన్నా మాఫీ కాలేదు. నేను అర్హురాలినే అయినా నా పేరు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేదు. కారణం అడిగితే బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అమలు కాని హామీలిచ్చింది. పవర్లోకి రాగానే వాటన్నింటినీ గాలికి వదిలేసింది. రుణమాఫీ అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప నిజమైన రైతులకు న్యాయం జరుగడంలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం.
-గొల్ల రామమ్మ, గ్రామం కోకట్, యాలాల మండలం