వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. 40 శాతం మంది అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూశారు. వరి నాట్లు ప్రారంభం కావడంతోపాటు రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న, పత్తికి యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉండడంతో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.
జిల్లాకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి సరిపోను స్టాక్ లేకపోవడంతోనే అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నది. అరకొర నిల్వలతో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని అగ్రో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. జిల్లాలో గత రెండు రోజులుగా యూరియా విక్రయించే అన్ని కేంద్రాల వద్ద రైతులు క్యూలో బారులు తీరుతున్నారు.
మంగళవారం వికారాబాద్‌తోపాటు జిల్లాలోని మండలాల్లో యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు మానుకొని పడిగాపులు గాచారు. అయినా కొంతమందికే యూరియా దొరుకుతున్నది. ఆ తర్వాత నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో సకాలంలో యూరియా నిల్వలను అందుబాటులో ఉంచారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
డిమాండ్‌ను గుర్తించని అధికారులు
వర్షాలు కురిస్తే ఒక్కసారిగా యూరియా కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుందని గుర్తించని అధికారులు అన్నదాతలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. యూరియా కొరతతో అన్నదాతలు కష్టాలు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం జిల్లాలో స్టాక్ ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రారంభంలోనే 2500 మెట్రిక్ టన్నుల వరకు యూరియాను ఆయా కేంద్రాల్లో నిల్వ ఉంచినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో యూరియాను కర్నాటక రైతులు కొనుగోలు చేసినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.
యూరియా కొరతను ఆసరాగా తీసుకుంటున్న కొందరు డీలర్లు బ్లాక్‌లో పెట్టి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కో బస్తాకు రూ.270 నుంచి రూ.280లకు విక్రయించాల్సి ఉండగా.. కొందరు ఒక్కో బస్తాకు రూ.350 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు వరికి ఒక ఎకరాకు రెండు బస్తాలు, మొక్కజొన్నకు మూడు బస్తాల యూరియా వేయాల్సి ఉండగా, రెట్టింపుగా యూరియాను పంటలకు వేస్తుండడంతోనే యూరియా వాడకం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
అందుబాటులో 6065 మెట్రిక్ టన్నులు
జిల్లా అధికారులు జిల్లా అంతటా సరిపోను యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా స్టాక్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సరిపోను యూరియా ఉంటే రోజుల తరబడి క్యూలో ఎందుకు పడిగాపులు పడుతామని అన్నదాతలు నిలదీస్తున్నారు. జిల్లాలో సాగు చేసే పంటలను బట్టి యూరియాకు సంబంధించి జిల్లాకు 39 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా.. ప్రస్తుతం 6065 మె.ట యూరియా మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అందుబాటులో ఉన్న యూరియా రిటైలర్స్ వద్ద 1884, సొసైటీల వద్ద 598, మార్క్‌ఫెడ్ వద్ద 3584 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెబుతున్నా.. 2-3 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేదని తెలుస్తున్నది.
ఎరువుల కొరత తీవ్రంగా ఉంది
మండలంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు ఎరువుల కోసం తిరిగిందిలేదు. అన్నదాతల అవసరాన్ని బట్టి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసింది. పదేళ్ల కాలంలో ఏనాడూ రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎరువుల కొరత తీవ్రంగా ఏర్పడింది. అధికారులు ఇప్పటికైనా అన్నదాతలకు అవసరమున్న మేర ఎరువులను సమయానికి అందించాలి.
– చాకలి లక్ష్మయ్య, రైతు సంఘం అధ్యక్షుడు ధారూరు
సమయానికి ఎరువులు అందించాలి
రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచి, సమయానికి అందించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయాని అన్నదాతలకు ఎరువులను అందించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రువులను సమయానికి అందించలేకపోతున్నది. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు లైన్లలో నిలబడలేదు. సమయానికి ఎరువులందిస్తే ఏ సమస్యా ఉండదు.
– బి.రాజు. రైతు, కెరెళ్లి గ్రామం, ధారూరు మండలం
పనులు వదులుకొని పడిగాపులు..
అవసరమైనప్పుడు యూరియా దొరకడం లేదు. కోట్‌పల్లి మండలంలో ఎక్కడ అడిగినా వ్యాపారులు యూరియా లేదంటున్నారు. ప్రస్తుతం దొడ్డు రకం యూరియా వచ్చింది. ఇక్కడ మాకు సన్నరకం యూరియా అవసరం ఉంటుంది. స్టాక్ మాత్రం ఉండడంలేదు. రైతులకు అవసరమైనప్పుడు సర్కారు అందుబాటులో ఉంచాలి. లేదంటే వ్యవసాయ పనులు వదులుకొని పట్టణాలకు ప్రయాణం చేయాల్సి వస్తున్నది.
– లక్ష్మణ్, రైతు, ఎన్నారం గ్రామం, కోట్‌పల్లి మండలం
గతంలో సునాయసంగా దొరికేది
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైనప్పుడు యూరియా దొరికేది. ఇప్పుడు ఎక్కడ వెదికినా దొరకడంలేదు. దుకాణాల్లో ఎవరిని అడిగినా లేదని, కొరత ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.
– రాజేందర్ యాదవ్, రైతు, రావులపల్లి , మర్పల్లి మండలం