వికారాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): మోసపూరిత హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయాన్ని పెంచుతామని, పంట రుణాలను మాఫీ చేస్తామంటూ హామీలనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో రైతుల ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే రైతన్నలు అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా రైతు మృతి చెందితే సంబంధిత కుటుంబం రోడ్డున పడకుండా బాధిత కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించేందుకుగాను కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు ఏ విధంగా మృతి చెందినా సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను కేవలం వారం రోజుల్లో ఆ రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సాయాన్ని జమ చేసేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చిన ఒకట్రెండు పథకాలకు కొర్రీలు పెట్టి అర్హుల్లో సగం మందికి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. రైతు బీమా సాయం కోసం మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలో వారంరోజుల్లో బీమా సాయం మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బీమా సాయం ఎప్పుడు వస్తుందంటూ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులున్నాయి. అదేవిధంగా నెలల తరబడి రైతు బీమా ఆర్థిక సాయం అందకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులను సైతం బాధిత కుటుంబాలు నిలదీస్తుండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 838 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వీరిలో చాలామంది మంది రైతులు గత కొన్ని నెలలుగా రైతు బీమా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి, రైతు ఆత్మహత్యలను నివారించేందుకుగాను ఏదేని రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల సాయాన్ని అందజేసేందుకుగాను రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చింది.
జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,262 మంది రైతులు మరణించగా, సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213.10 కోట్లను మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులకు పరిహారాన్ని అందజేశారు. అయితే మృతి చెందిన రైతు కుటుంబసభ్యులకు తొలుత రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన గత ప్రభుత్వం తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.39.30 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 812 మంది అర్హులుగా గుర్తించి రూ.40.60 కోట్ల సొమ్మును సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1047 కుటుంబాలకు రూ.52.35 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 416 మంది రైతులు మృతి చెందగా, సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.20.80 కోట్ల బీమా సాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.