ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలమయ్యాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు ఆపసోపాలు పడుతు న్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడంతో అక్కడి కల్లాలోనే ధాన్యాన్ని నిల్వ ఉంచారు. కాగా, గత రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో కల్లాలు, రోడ్లపై ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడంతోపాటు కొన్ని చోట్ల కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 87వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగగు చేయగా.. సుమారు 60వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
కొనుగోలు కేంద్రాలను తెరిచి నెలరోజులు దాటినా ఇప్పటివరకు జిల్లాలో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. మిగతా ధాన్యం కల్లాల్లోనే నిల్వ ఉన్నది. అలాగే, వికారాబాద్ జిల్లాలోని ధారూరు, దోమ, దుద్యాల, దౌల్తాబాద్, కొడంగల్, పెద్దేముల్, కులకచర్ల మండలాల్లో రైతులు గన్నీ బ్యాగుల్లో నింపిన ధాన్యం, కల్లాల వద్ద ఆరబెట్టిన వడ్లు తడిసిపోయ్యాయి. ధారూరు మండలంలోని గట్టేపల్లి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సందర్శించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనడంలో తీవ్ర జాప్యం చేయడంతోనే వర్షానికి తడిచి మొలకెత్తినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొలకెత్తిన వడ్లను రోడ్డుపై నాట్లు వేసి సర్కార్ నిర్లక్ష్యంపై రైతులతో కలిసి నిరసన తెలిపారు.
రంగారెడ్డి, మే 27 (నమస్తేతెలంగాణ) : రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అనేక కొర్రీలు విధించడం, గన్నీబ్యాగులు, హమాలీలు, లారీల కొరతతో కొనుగోళ్లు సజావుగా సాగడంలేదు. దీంతో అన్నదాతలు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజుల తరబడిగా అక్కడే కుప్పలుగా పోసి ఎప్పుడు కాంటా చేస్తారా? అని పడిగాపులు కాస్తున్నా రు. గత రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాం తాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతోపాటు కొట్టుకుపోయింది. తలకొండపల్లి, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్, యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో అనేక ప్రాంతాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. రైతులు తీ వ్రంగా నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబోసినా కొనుగోలు కేంద్రా ల సిబ్బంది కొనడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించేందుకు 37 కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వాటిని ఐకేపీ, డీసీఎంఎస్, సహకారసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలకు ఐదు నుంచి ఆరు లారీలు వస్తున్నా బయటికి ఒక్కలారీ కూడా వెళ్లటంలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నాయి. ధాన్యాన్ని బస్తాల్లో నింపి సిద్ధంగా ఉంచామని లారీలను పంపాలని నిర్వాహకులు అధికారులను కోరుతున్నా ఫలితం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు జిల్లాలో 8 రైస్‌మిల్లులను ఎంపికచేశారు. పలు రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వ కోసం స్థలం లేదంటూ వచ్చిన వడ్లను తీసుకునేందుకు అక్కడి మిల్లుల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో లోడిం గ్ అయిన లారీలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయడంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు కోరుతున్నారు.
వికారాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాలు, రోడ్లు, కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. ధారూరు, దోమ, దుద్యాల, దౌల్తాబాద్, కొడంగల్, పెద్దేముల్, కులకచర్ల మండలాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు గన్నీ బ్యాగుల్లో నింపగా అకాల వర్షానికి మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొడంగల్ మండలంతోపాటు మరికొన్ని చోట్ల రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. బొంరాస్‌పేట మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద ఉన్న వడ్లు తడిసిపోయాయి.
కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి నెలరోజులవుతున్నా కాంటా చేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని సీఎం సొంత నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తూకం వేయకపోవడంతో అక్కడే పది రోజులుగా ఆరబెట్టిన రైతులకు గత రెండు రోజులుగా కురిసిన వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్ద కావడంతో మళ్లీ మరో వారం రోజులపాటు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. చేతికి వచ్చిన పంట నష్టపోతుండడంతో ప్రభుత్వం ఆదుకోవాలని, తేమ శాతం అంటూ కొర్రీలు పెట్టకుండా కొనాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
గత పదిహేను రోజులుగా ధాన్యాన్ని కొనకపోవడంతో అక్కడి కల్లంలోనే వడ్లను ఉంచి కాపలా కాస్తున్నా. మరోవైపు అమ్మిన ధాన్యానికి బిల్లులు కూడా రావటంలేదు. అధికారుల ను అడిగితే చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విక్రయించిన ధాన్యానికి బిల్లులు ఇవ్వడంతోపాటు కొనుగోళ్లను వేగవంతం చేయాలి. -కందుకూరు శ్రీనివాస్, నానక్‌నగర్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరగా కాంటా చేయడంలేదు. దీంతో అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నది. ప్రభుత్వం వర్షాలకు తడిసిన వడ్లను కూడావెంటనే కొనుగోలు చేయాలి.
-చల్లా యాదవరెడ్డి, నానక్‌నగర్