వికారాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రుణమాఫీ జాబితా తప్పుల తడకగా మారింది. పలు బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చిన రుణాలు తీసుకున్న రైతుల జాబితాతో రైతులు అటు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బ్యాంకర్లు ఇచ్చిన రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలను తప్పుగా నమోదు చేయడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు గుర్తించారు.
ఓ వైపు ప్రభుత్వం పెట్టిన షరతులతో అర్హులైన చాలా మంది రైతులు నష్టపోగా, మరోవైపు బ్యాంకర్లు చేసిన తప్పిదాలతో మరికొంత మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అయితే రూ.లక్షన్నర వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయ్యిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అర్హులైన రైతులకు కూడా అన్యాయం జరిగింది.
రుణమాఫీ కాని రైతుల సంఖ్య అధిక మొత్తంలో ఉండడంతో కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలోని టెక్నికల్ సెక్షన్లో, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో, క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా ఏఈవోలను రుణమాఫీ కాని రైతుల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. అయితే జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్న ప్రకారం ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని 2 వేల మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడితే అర్హులైనప్పటికీ రుణమాఫీ కాని రైతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
తప్పుల తడకగా రుణమాఫీ జాబితా…
పేరు ఒకరిది ఆధార్ నెంబర్ మరొకరిది…రైతుల పేర్లు తప్పుగా నమోదు చేయడం…ఆధార్‌లో ఉన్న పేరుకు పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న పేరు ఒకేలా ఉండకపోవడం..ఇలా రుణమాఫీ జాబితా తప్పుగా నమోదు నమోడంతో చాలా మంది రైతులు నష్టపోయారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన గ్రీవెన్స్‌లో 70 శాతం వరకు ఆధార్ నంబర్ సరిలేకపోవడం, రేషన్‌కార్డు లేకపోవడం, రైతు పేరును తప్పుగా ఎంట్రీ చేయడం వంటి ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.
అయితే కొన్ని బ్యాంకులు ఇచ్చిన జాబితాలో తప్పుగా ఎంట్రీ చేయడంతోనే చాలా మంది రైతులు అర్హులైనప్పటికీ రుణాలు మాఫీ కాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వ్యవసాయాధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 2 వేల వరకు ఫిర్యాదులురాగా, ఆధార్ నెంబర్ సరిలేకపోవడం(మిస్మ్యచ్), వీటిలో కుటుంబ నిర్ధారణ కాకపోవడం(రేషన్ కార్డులేకపోవడం) ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి.
రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఎప్పుడో పూర్తైనప్పటికీ, బ్యాంకర్లు ప్రభుత్వానికి అందజేసే రైతుల వివరాలను నమోదు చేసే సమయంలో తప్పుగా ఎంట్రీ చేయడంతోనే రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం సమయం ఎక్కువగా ఇవ్వకుండా తక్కువ సమయంలోనే రుణమాఫీ జాబితాను పంపాలని ఆదేశించడంతోనే తప్పులు జరిగినట్లు బ్యాంకర్లు చెప్పుకొస్తుండడం గమనార్హం.
అంతేకాకుండా మొదట రెన్యూవల్ కాని రైతుల జాబితా సేకరించిన అనంతరం మళ్లీ రెన్యువల్ చేసుకున్న జాబితా పంపాలని ఆదేశించారు, అయితే మొదట పంపిన జాబితానే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో కూడా రైతులకు నష్టం జరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు.
మరోవైపు అర్హులైన రుణమాఫీ కాని రైతులు జిల్లా కలెక్టర్‌కు తమ పంట రుణాలు రూ.లక్షన్నరలోపు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేయగా, సదరు బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ తప్పుగా ఎంట్రీ చేయడంతో నష్టపోయిన రైతుల వివరాలను అందజేయాలని, ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రూ.లక్షన్నరలోపు రుణాలు మాఫీ కావడంతో ప్రత్యేకంగా రుణమాఫీ చేపట్టడం సాధ్యమా అనే సందేహాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.