షాబాద్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం చేవెళ్లలోని శంకర్పల్లి ఎక్స్ రోడ్డులో ఉన్న ఇంద్రారెడ్డి చౌరస్తాలో జరిగిన రైతు ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుక్షణం రైతుల గురించే ఆలోచించారని.. వారిని కంటికి రెప్పలాగా కాపాడారన్నారు. అన్నదాతలు తమ పంటలను సాఫీగా సాగుచేసుకునేందుకు 24 గంటలపాటు కరెంట్‌ను ఉచితంగా పంపిణీ చేశారన్నారు.
అంతేకాకుండా పంటల సాగుకు అన్నదాతలు వడ్డీవ్యాపారులు, ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి తిప్పలు పడొద్దనే సదుద్దేశంతో వాన చినుకులు పడిన వెంటనే రైతుబంధు డబ్బులను రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారని గుర్తు చేశారు. రైతు చనిపోతే దినవారం కూడా కాకముందే రూ.5లక్షల బీమా చెక్కును బాధిత కుటుంబానికి అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆరుగాలం కష్టించి పని చేసే అన్నదాతకు అండగా ఉండేందుకు.. పండించిన పంటకు మద్దతు ధరను చెల్లించి కొనేందుకు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.
నీటి వనరుల కోసం కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే పూర్తికాగా.. అక్కడ రెండు పిల్లర్లు దెబ్బతింటే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. నీళ్లుండి..వాడుకునే అవకాశం ఉన్నా.. సరఫరా చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి అన్నదాతలు ఇబ్బందిపడుతుంటే పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ పర్యటనకెళ్తే.. తెల్లారే నీళ్లు వచ్చాయని.. అంటే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టే విడుదల చేశారన్నారు.
దీనిని బట్టి చూస్తే.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువేనని మనకు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. కేసీఆర్ ఎర్రటి ఎండలో పొలాల్లో తిరుగుతూ.. రైతులతో మాట్లాడి భరోసా కల్పిస్తున్నారని.. ప్రభుత్వం దిగొచ్చి అన్న దాతకు న్యాయం చేసేవరకు కొట్లాడుతానని అభయం ఇచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 110 రోజులు గడిచినా ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలేదని మండిపడ్డారు. వరిపంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటలకు పరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని.. బీఆర్ఎస్ అధినేతను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మండిపడ్డారు. పంటలు ఎండినా.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోవడంలేదన్నారు. సాగునీటిని అన్నదాతలకు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్నారు. బీఆర్ఎస్పై బురదజల్లడం మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాలకులకు సూచించారు. ఈ దీక్షలు ఆరంభం మాత్రమేనని.. మళ్లీ ఉద్యమబాట పడితే ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు.
14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆయన పదేండ్ల కాలంలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందించారు. అన్నదాతలకు ఉచితంగా 24 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎనాడూ కరెంట్ పోలేదు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు నాలుగైదుసార్లు కరెంట్‌ను కట్ చేస్తున్నారు. రైతన్నలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. కార్యక్రమంలో జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, ఎంపీపీలు గోవర్ధ్దన్‌రెడ్డి, గునుగుర్తి నక్షత్ర, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, అనంతరెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, నాగిరెడ్డి, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు వెంకటరంగారెడ్డి, డాక్టర్ ప్రశాంత్‌గౌడ్, నర్సింగ్‌రావు, పాపారావు, యాదగిరి, జయంత్, శేఖర్, పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుదీక్షలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మైక్‌లో మాట్లాడుదామకున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో ఆమె విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కరెంట్ కట్ చేయొద్దని చెప్పారు కాదా అడిగారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా జరుగడంలేదని ప్రజలు చెబుతుంటే మీరేమో ట్రిప్ అయిందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రోజుకు నాలుగైదు సార్లు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటున్నదని అన్నదాతలు చెబుతున్నారని ..దీనిని బట్టి రాష్ట్రంలో కరెంట్ ఎలా ఉందో తెలుస్తున్నదన్నారు.
కొడంగల్ : సీఎం కేసీఆర్ హయాంలో రైతులు ఏ లోటు లేకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటూ దర్జాగా బతికితే.. నేడు కాంగ్రెస్ సర్కార్ పాలనలో సాగునీటి కొరత, కరెంటు కోతలతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ కూడలిలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.
ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పటివరకు కనీసం ఆరు గ్యారెంటీలను సైతం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీనీ అమలుచేసే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సోనియా పుట్టినరోజున రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడున్న పచ్చటి వాతావరణాన్ని కాలుష్యంతో నాశనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాన్నారు.
కొడంగల్ ప్రజల రుణాన్ని తీర్చుకోవాలంటే ఐటీ, టెక్స్టైల్, టెస్లా కార్ల వంటి కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి ఎండిన పంటలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. వరి ధాన్యానికి ఇస్తామన్న రూ. 500 బోనస్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ నేతల మాటలకు మోసపోయినట్లు.. పార్లమెంటు ఎన్నికల్లో మోసపోకూడదని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
వికారాబాద్ : కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. ఇది చాలదన్నట్లు రైతుబంధు, రుణమాఫీ, వరి ధాన్యానికి రూ.500 బోనస్ వంటి హామీలను అమలు చేయకుండా రైతులను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నదన్నారు. ఎండిన పంటలకు కనీసం నష్టపరిహారం ఇచ్చే స్పృహ కూడా కాంగ్రెస్ సర్కార్‌కు లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
మండుటెండల్లో ప్రజలకు కనీసం తాగునీరిచ్చే సోయి కూడా పాలకులకు లేదన్నారు. మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ దద్దమ్మలు ఉన్నారన్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికలకు ముందే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు కోడ్‌ను సాకుగా చూపుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఈ దీక్షలు ఆరంభం మాత్రమేనని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, అనంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, గోపాల్, రామస్వామి, వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్, గిరీశ్, సుభాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే రాష్ట్రంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయని.. గతంలో పచ్చదనాన్ని తలపించిన పంట పొలాలు నేడు నీళ్లు లేక ఎడారిగా మారుతున్నాయని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు షాద్‌నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం రైతు నిరసన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తక్షణమే రైతులను ఆదుకోవాలన్నారు.
పంటలకు నీళ్లు ఇవ్వడంతోపాటు ఎండిన పంటల కు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు ప్రతాప్‌రెడ్డి, నందీశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నాయ కులు లక్ష్మణ్‌నాయక్, శ్రీనివాస్, చందూనాయక్, ప్రమోద్, ఆఫీజ్, యాదగిరి, సత్యనారాయణ, రాజలక్ష్మి, విజయలక్ష్మి, వెంకట్‌రెడ్డి, యుగేందర్, శంకర్, చంద్రశేఖర్, పాండు రంగారెడ్డి, హన్యానాయక్, రామకృష్ణ, ఏజాజ్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.