ధాన్యం నుంచి తాలు వేరుచేసే మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదు. దీంతో వడ్లలో తేమ అధికంగా ఉందన్న సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని కొనడంలేదు. తాలు లేకుండా ఎండలో ఆరబెట్టి మళ్లీ తీసుకొచ్చినా.. కాంటా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యవసాయం చేయడం కంటే కూలీ పనులు చేసుకుని జీవించింది నయం.
– యాదమ్మ, మహిళా రైతు
రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత తీవ్ర కష్టాలు పడుతున్నాడు. పండించిన పంటను విక్రేయించేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను అమ్మేందుకు వారాల తరబడిగా అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. రాచకొండ మైలారంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రానికి ఆండాళు అనే మహిళా ధాన్యాన్ని తీసుకొచ్చి 15 రోజులు దాటినా కాంటా వేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో 20 నుంచి ముప్పై లారీల వరకు ధాన్యం నిల్వలున్నాయి. కానీ, రెండుమూడు రోజులకొక లారీ వస్తుండడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఒక్కో కొనుగోలు కేంద్రంలో వేల సంఖ్యలో మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరత
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గన్నీబ్యాగులున్నా అవి చాలావరకు చినిగిపోయి ఉండడంతో.. అందులో ధాన్యాన్ని నింపలేని దుస్థితి నెలకొన్నది. అలాగే, వడ్లు, తాలును వేరుచేసే మిషన్లు కూడా సరిగా పనిచేయటం లేదని.. ఆ భారాన్ని కూడా రైతులపైనే కొనుగోలు కేంద్రాల సిబ్బంది రుద్దేతున్నారని పలువురు వాపోతున్నారు.
పదిహేను రోజులుగా కల్లంలోనే..
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 15 రోజులవుతున్నది. వడ్లను ఎండబెట్టి తూర్పారా పట్టినా ఇంకా కాంటా చేయడంలేదు. సంచుల్లో నింపిన వడ్లను తరలించేందుకు సరిపడా లారీలు రాకపోవడంలేదు. వడ్లను ఎప్పుడు కాంటా పెట్టుతారో.. ఎప్పుడు ఇంటికి వెళ్తామో..?
-శ్యాములు రైతు
కాంటా చేయడంలేదు
ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ త్వరగా జరుగడంలేదు. గత ఇరవై రోజులుగా పరిస్థితి దారుణంగా ఉన్నది. వడ్లను ఎండబెట్టి.. తాలు లేకుండా చర్యలు తీసుకున్నా.. కంటా మాత్రం పెట్టడంలేదు. కొనుగోలు కేంద్రం వద్దే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. వర్షాలు రాకముందే అధికారులు ధాన్యాన్ని కొనాలి.
-ఆండాళు, మహిళా రైతు