వికారాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. మొదట్నుంచీ పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత కొత్త నాటకానికి తెర తీసింది. కేవలం కొడంగల్ నియోజకవర్గానికే సాగు నీరిచ్చేలా కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా చేపడుతున్నది. కేవలం సీఎం సొంత నియోజకవర్గానికే సాగునీరిచ్చి జిల్లాలోని మిగిలిన వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు, రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేవలం కొడంగల్‌కు మాత్రమే సాగునీరందిస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటనేది ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను రైతులు నిలదీయడం ఖాయమని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. మూడు నియోజకవర్గాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే గత బీఆర్ఎస్ హయాంలో 90శాతం పనులు పూర్తైన ఉద్దండాపూర్ నుంచి కాకుండా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు సెగ్మెంట్లకు సాగునీరందించాలని నిర్ణయించడం కుట్ర లో భాగమనే ప్రచారం జరుగుతున్నది.
కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ టన్నెల్ నిర్మాణానికే ఐదేండ్ల సమయం పట్టే అవకాశమున్నదున మూడు సెగ్మెంట్లకు సాగు నీరందడం కలేనన్నా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే 30 నెలల పాలన ముగిసిన తర్వాత కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రస్తావన ఎందు కు చేస్తుందని దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా మొత్తానికి సాగునీరందించే ఉద్దేశముంటే దాదాపు పూర్తి కావొచ్చిన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి, కాల్వలను తవ్వి కేవలం ఏడాదిలోగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు అందించేంది.
అంతేకాకుండా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కేవలం 5కిలోమీటర్ల దూరంలోనే జిల్లాలోని చౌడాపూర్ మండలానికి, తదనంతరం కులకచర్ల, పరిగి, నస్కల్, వికారాబాద్, తాండూరులకు సాగు నీరందించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ, రేవంత్‌రెడ్డికి వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగునీరందించే ఇష్టంలేకే కుట్రలో భాగంగానే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చినట్టు పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ చేసేలోగానే రెం డేండ్లు పూర్తవుతుంది. తదనంతరం ఎన్నికల పేరిట ఎక్కడిక్కడ పనులు నిలిచిపోవడం ఖాయం కాబట్టి భూసేకరణతోనే ఫుల్స్టాప్ పడనున్నదనే ప్రచార మూ జరుగుతున్నది. గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో సర్వేల పేరిట గుంతలు తవ్వి దాదాపు రూ.120 కోట్ల వరకు వృథా చేసినట్టుగానే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు ఖర్చు చేసే నిధులు కూడా వృథానే అని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.
రెండున్నరేండ్లు ఏం చేసిండ్రు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో రెండున్నరేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై విషం చిమ్మి..ఇప్పుడేమో వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లకు సాగునీరందించేందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో కుట్ర దాగి ఉన్నది. కేవలం కొడంగల్‌కే సాగునీరిస్తే, మిగతా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను రైతులు గ్రామా ల్లో తిరగనివ్వరనే భయంతోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా నీరందిస్తామని చెబుతున్నది. ఉద్దండాపూర్ వద్ద 90 శాతం వరకు పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు, కాల్వల తవ్వకాన్ని పూర్తి చేస్తే ఏడాదిలోగానే జిల్లాకు సాగునీరందేది. కానీ , మాజీ సీఎం కేసీఆర్‌కు ఇమేజ్ వస్తుందనే కారణంతోనే కాం గ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
-కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే

90 శాతం పూర్తయిన పనులు..
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం వరకు పూర్తయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీడ్లు బారిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరందించి ప్రజల ఏండ్ల కలను నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి రూ.27 వేల కోట్లను ఖర్చు చేసింది.
ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికా గా, కేవలం సాగునీరందించేందుకు కాల్వల తవ్వకం పనులు మిగిలి ఉండ గా అందుకోసమూ రూ.5 వేల కోట్ల నిధులను విడుదల చేసి టెండర్లను కూడా పిలిచింది. ఏడాదిలో సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరాశే మిగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేయడంతోపాటు 90 శా తం పనులూ పూర్తయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు 2 వేల వరకు హబిటేషన్లకు తాగునీరందించేలా గత కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసులు వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ధోరణితో వ్యవహరిస్తున్నది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి మిగతా పదిశాతం పనులు పూర్తి చేసి, కాల్వల తవ్వితే జిల్లాకు సాగు నీరొచ్చేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల వర కు పట్టించుకోకుండా ప్రస్తుతం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను తెరపై కి తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర దాగుందనే విమర్శలు న్నాయి. పాలమూరు-ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ వస్తుందనే కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందనే ఆరోపణలూ ఉన్నాయి. రేవంత్‌రెడ్డి కొడంగల్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారు తప్ప జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగునీరందించడంపై ఎలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయం.