రంగారెడ్డిజిల్లాలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి, వరినాట్లు వేసిన రైతులు కళ్ల ముందే పొలాలు ఎండిపోతుండటంతో వారి గుండె చెరువవుతున్నది. జిల్లావ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయి. ఏ గ్రామంలో చూసినా ఎండిన వరి పైర్లే దర్శనమిస్తున్నాయి. ఎండిపోయిన పొలాలు పశువులు, గొర్రెలకు మేతగా మారిపోయాయి. మంచాల మండలం తిప్పాయిగూడ గ్రామంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామంలో సుమారు 400 మంది రైతులున్నారు. వీరిలో వందమందికి కూడా రైతు భరోసా రాలేదు. మిగతావారంతా పెట్టుబడి కోసం అప్పులు చేసి వరి వేశారు. వేసిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
– రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ)
నేను ఓ పెద్ద రైతు వద్ద రెండెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. ఆ పొలంలో సుమారు యాభై వేల అప్పు చేసి వరి వేశా. పొలం దున్నినప్పటి నుంచి నాట్లు, ఎరువులు వంటి వాటికి యాభై నుంచి అరవై వేల వరకు ఖర్చయింది. నాట్లు వేసి నెల రోజులు కాకముందే బోరు ఎండిపోయింది. దీంతో వరి పూర్తిగా ఎండిపోయింది. నేను నా కుటుంబం మొత్తం పొలం పనుల్లోనే ఉండి పనిచేశాం. మేము చేసిన కష్టం పోయినప్పటికీ అప్పులు తీర్చే మార్గం కనిపించడంలేదు. – కళమ్మ, కౌలు రైతు, తిప్పాయిగూడ
యాసంగిలో ఆరెకరాల్లో వరి పంట సాగు చేశా. దీని కోసం సుమారు రెండు లక్షలు ఖర్చయింది. పంటల సమయంలో రైతు భరోసా రాలేదు. అంతకుమందు కూడా వేసిన పంటలకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. ఆ రుణం కూడా మాఫీ కాలేదు. ఇప్పుడు వేసిన పంట నీళ్లులేక పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీలేక పంటను గొర్లు మేపుకోవడానికి ఇచ్చేశా. ఈ పరిస్థితిలో అప్పులు తీర్చాలంటే ఏదైనా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండిన పంట పొలాలకు ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి. – జంగయ్య, రైతు, తిప్పాయిగూడ
నాకున్న మూడెకరాల్లో రెండెకరాలు వరి పంట వేశాను. ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ వ్యవసాయమే ప్రధానం కాబట్టి అప్పులుచేసి పంట సాగు చేశా. ఉన్న బోరు పూర్తిగా ఎండిపోయింది. వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. పంట పొలాలను చూసి గుండె తరుక్కుపోతున్నది. ఈ పరిస్థితిలో పొలంవైపు వెళ్లడానికి ఇష్టంలేక, పశువుల మేత కోసం వదిలేశాను. ప్రభుత్వం ఆదుకుని తమ అప్పులను మాఫీ చేయాలి.
– గాన్షా, కడీలబావితండా