రంగారెడ్డి, మే 3, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నప్పటికీ ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మాత్రం నిలువ నీడ ఉండని పరిస్థితి ఏర్పడింది. సర్కారు హడావుడిగా కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ అన్నదాతలకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో రైతులు మండుతున్న ఎండలో రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సౌకర్యం కూడాడ లేకపోవడంతో అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. కేంద్రాల వద్ద తప్పనిసరిగా నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అలాగే తాగు నీటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం సౌకర్యాలపై దృష్టి సారించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రెండు మూడు రోజులు గడిచినప్పటికీ కొనుగోలు చేయడం లేదు. ధాన్యం పచ్చిగా ఉందని.. మరోవైపు తాలు అధికంగా ఉందని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. దీంతో అన్నదాతలు కేంద్రాల వద్ద ధాన్యం ఎండబెడుతున్నప్పటికీ వడ్ల నుంచి తాలు వేరు చేసే మిషన్లు అందుబాటులో లేకపోవడంతో మరింత జాప్యం జరుగుతున్నది.
జిల్లావ్యాప్తంగా 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో అత్యధికంగా పంట పొలాలలోనే ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 8, సహకార సంఘాల అధ్వర్యంలో 24, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 5 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదివారం జిల్లాలోని రాయపోల్ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతోనే రైతు మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.