Keshampet | కేశంపేట, మార్చి 19 : రోజురోజుకు ముదురుగుతున్న ఎండలవల్ల పంటలు దెబ్బతింటుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి భూగర్భ జలాలు అడుగంటి బోర్లల్లో నీరు ఇంకిపోతుండడంతో సగానికిపైగా బోరు మోటార్లు నీరుపోయడం పూర్తిగా తగ్గించాయి. దీంతో బోరు మోటార్లను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతన్నలకు ఎండుతున్న పంటను చూసి ధీనంగా సాయంకోసం ఎదురుచూస్తున్నారు.
పంటలను కాపాడుకునేందుకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు మరో రైతు సాయాన్ని కోరుతున్నాడు. మండల వ్యాప్తంగా కొద్దిమేర పంటలు పాడవకుండా ఉన్నాయంటే అందుకు సమీప పొలాల్లోని సాటి రైతులు అందిస్తున్న నీటిసాయమే కారణమని చెప్పకతప్పదు. గత వర్షాకాలంలో 4వేల ఎకరాల్లో సాగైన వరి పంట నేడు 2,200ఎకరాలకు పరిమితమైనట్లు వ్యవసాయశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రైతులు సాగు చేసిన పంట పొలాలకు అందుబాటులో ఉన్న మరో రైతు బోరు నీటిని పుష్కలంగా పోస్తే ఆ రైతు సాయాన్ని కోరుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో సాటి రైతు సైతం మానవతాదృక్పథంతో నీటిసాయానికి పూనుకుంటున్నాడు.