రంగారెడ్డి, మే 3 (నమస్తే తెలంగాణ) : రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.. ధాన్యాన్ని రోడ్లపై.. కల్లాల్లో ఆరబోస్తుండగా.. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఎక్కడికక్కడే వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని విక్రయించడం వారికి ప్రాణసంకటంగా మారింది.
జిల్లాలో శుక్రవారం రాత్రి.. అదేవిధంగా శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం నానిపోయి అన్నదాతకు నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ధాన్యాన్ని సేకరించేందుకు 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందులో సగం కూడా ప్రారంభం కాలేదు ..ఓపెన్ అయిన కేంద్రాలు కూడా మూడురోజులకే మూతపడ్డాయి. ఓ వైపు గన్నీ బ్యాగులు, మరోవైపు హమాలీల కొరతతో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరుగడంలేదు.
కొనుగోళ్లు 20వేల మెట్రిక్ టన్నులే..
ఈ యాసంగిలో జిల్లాలో 2,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా.. 20,000 మెట్రిక్ టన్నులే కొనాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. దీంతో మిగతా రైతులు ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక మధ్యదళారులను ఆశ్రయిస్తున్నారు. పంట లు కోసి ధాన్యాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోస్తున్నారు. రోజుల తరబడి కొనుగోళ్లు లేకపోవడంతో రోడ్లపైనే ధాన్యం రాశులు పోసి రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సిన పరిస్థితి అన్నదాతకు ఏర్పడింది. ప్రభుత్వం స్పం దించి తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని పలువురు కోరుతున్నారు.
రోడ్లపైనే రాశుల కుప్పలు..
జిల్లాలోని ఏ రోడ్డును చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అనువైన స్థలం లేకపోవడంతో ఔటర్‌రింగ్‌రోడ్డు, సర్వీసురోడ్లతోపా టు ఆయా ప్రధాన, అంతర్గత దారుల్లోనూ అన్నదాతలు వడ్లను ఆరబెట్టి కాపలా కాస్తున్నారు. అయినా అకాల వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నాయి.
తడిసిన ధాన్యాన్ని కొనాలని నిరసన
ఆమనగల్లు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతోపాటు శనివారం కురిసిన వర్షానికి రైతులు ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసిపోయాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని నిరసన చేపట్టారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు రోడ్ల పక్కన, కల్లాల్లోనే వడ్లను రోజుల తరబడిగా ఉంచి కాపలాగా ఉంటున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ఎండిన వడ్లు కూడా తడిసి ముద్దవుతున్నాయి. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలను ఆదుకోవాలి.
-జంగయ్య, రైతు