రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పేద, మధ్యతరగతి రైతుల భూములే టార్గెట్‌గా రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపులార్) ఏర్పాటుతో భూములు కోల్పోతున్న వివిధ గ్రా మాల రైతులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాలను అందించారు.
ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కేశంపేట, కొం దుర్గు, ఫారుక్‌నగర్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు తమ భూ ములను కోల్పోతున్నామని, పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పాత అలైన్మెంట్ ద్వారా భూ స్వాములు, కార్పొరేట్ సంస్థలకు నష్టం జరుగుతుందని భావించి.. వారి ఒత్తిడి మేరకు హెచ్ఎండీఏ అధికారులు కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారని వాపోయారు. ఈ అలైన్మెంట్తో ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే మేము ఎలా బతకాలని కలెక్టర్ ఎదుట అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు మధ్యనుంచి రోడ్డు వేయొద్దు..
మాడ్గుల మండలంలోని కలకొండ రెవెన్యూ శివారులోని పలు సర్వేనంబర్లలోని భూమిని రింగ్‌రోడ్డు కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం చంద్రాయణ్పల్లి గ్రామంలోగల తెల్లకొండ చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నుంచి రోడ్డు వేస్తే దాని కింద ఉన్న చం ద్రాయణపల్లి, కలకొండ తదితర గ్రామాల ఆయకట్టు భూములకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని.. ఆ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు వినతిపత్రంలో వివరించారు. గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌నే కొనసాగించాలన్నారు.
ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలోని వ్యవసాయ భూముల నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని.. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తొమ్మిదిరేకులలో అనేకమంది రైతులు భూ ములపైనే ఆధారపడి జీవిస్తున్నా రని.. ఆ భూములను రోడ్డుకో సం తీసుకుంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి న పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రాణాలు పోయి నా మా భూములను వదులుకోమని రైతులు కలెక్టర్‌కు వివరించారు.
హెచ్ఎండీఏ కార్యాలయానికి తరలిన బాధితులు
పూడూరు : ట్రిపులార్లో భూములు కోల్పోనున్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కమిషనర్ కార్యాలయానికి తరలివెళ్లారు. సోమవారం ఉదయం మండలంలోని ఎన్కెపల్లి, మన్నెగూడ, గొంగుపల్లి, పెద్దఉమ్మెంతాల్, పూడూరు, కెరవెళ్లి, సిరిగాయపల్లి, మంచన్‌పల్లి, మరియపూరు, గట్టుపల్లి, తుర్కెన్కెపల్లి గ్రామాల రైతులు, ఆయా పార్టీల నాయకులు సుమారు 500 మంది పలు వాహనాల్లో హెచ్ఎండీఏ కార్యాలయానికి తరలివెళ్లి అక్కడ ఆర్ఆర్ఆర్ వద్దు.. మా భూములు మాకే ఉండాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్ఆర్ నిర్మిస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతర హెచ్ఎండీఏ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందించాలి. అదేవిధంగా కేశంపేట, కొందుర్గు మండలాల నుంచి కూడా రైతులు అధికంగా హెచ్ఎండీఏ కార్యాలయానికి తరలివెళ్లారు.
పేదల పొట్ట కొట్టొద్దు
ఆమనగల్లు : ప్రభుత్వం పేదల పొట్ట కొట్టేందుకు యత్నిస్తున్నదని, అందుకే పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్‌దారుల కోసం రిజినల్ రింగ్‌రోడ్‌ను వంకర మార్చిందని రైతు సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షుడు జంగారెడ్డి ఆరో పించారు. ట్రిపులార్ పాత అలైన్మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబా ద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం మాలేపల్లి, పోలేపల్లి, సిం గంపల్లి, సంకటోనిపల్లి గ్రామాల రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎంకు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పాత అలైన్మెం ట్ ప్రకారం రోడ్డును ఏర్పాటు చేయాలని.. లేకుంటే సీఎం క్యాంపు కార్యా లయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నిరసనలో రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్, రాష్ట్ర నాయకుడు యాదయ్య, వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ఉప అధ్యక్షులు వెం కటయ్య, ప్రజాసంఘాల నాయకులు శివశంకర్, కురుమయ్య, చెన్నంపల్లి మాజీ సర్పంచ్ శ్రీన య్య, భూనిర్వాసితులు పరమేశ్ , తిరుపతి, రాజు, కృష్ణ, లక్ష్మయ్య, జ్యోతి, రాఘవేందర్, జంగమ్మ, బలరాం, రాకేశ్ తదితరులు ఉన్నారు.
పాత అలైన్‌మెంట్‌ను మార్చొద్దు
ట్రిపులార్ కోసం కొత్తగా రూపొందించిన ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకుని పాత దానిని కొనసాగించా లి. అలైన్మెంట్ మార్పుతో అనేక మం ది రైతులు రోడ్డునపడుతారు. వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. -పురుషోత్తంరెడ్డి, చంద్రాయణ్పల్లి
పేదల భూములే టార్గెట్‌గా..
ట్రిపులార్‌తో మాడ్గుల మండలంలోని పలు గ్రామాలకు చెందిన అనేకమంది పేదలు తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా కొన్నేండ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వారి భూములను
తీసుకుంటే ఉపాధి లేక రోడ్డునపడుతారు.
-మొండె బక్కయ్య, కలకొండ
చెరువు మధ్య నుంచి రోడ్డు ఎలా సాధ్యం
మాడ్గుల మండలంలోని చండ్రాయన్పల్లి గ్రామంలోని చెరువు మధ్యనుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. చెరువు మధ్యనుంచి రోడ్డు వేస్తే ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన చండ్రాయన్పల్లి చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ఈ చెరువు ఆయకట్టు కింద భూమిని సాగు చేసుకుని ఎంతోమంది రైతులు జీవిస్తున్నారు. వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది.
-కసిరెడ్డి జంగారెడ్డి, చంద్రాయణ్పల్లి