రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు రైతుల ఖాతాల్లో రూ.30.79 కోట్లు జమ
వికారాబాద్ జిల్లాలో రూ.70.95 కోట్లు..
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,68,559 మంది లబ్ధిదారులు
129037 మంది రైతులకు లబ్ధి
ఎకరా భూమిలోపు రైతులందరికీ అందిన సాయం
నేడు రెండు ఎకరాలలోపు అన్నదాతలకు..
సంతోషం వ్యక్తం చేసిన రైతాంగం.. సీఎం కేసీఆర్‌కు జేజేలు
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హులైన రైతులందరికీ అందించనున్నది. మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో ఎకరాకు రూ.5వేల చొప్పున 1,08,207 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.30.79 కోట్ల సాయాన్ని జమ చేసింది. అలాగే వికారాబాద్ జిల్లాలో 129037 మంది రైతులకు రూ.70.95కోట్లు అందజేసింది. రైతుబంధు డబ్బులు జమైనట్లు సెల్ఫోన్లకు వచ్చిన సమాచారాన్ని చూసుకున్న రైతులు మురిసిపోయి సంబురాలు చేసుకున్నారు. ఏటా ఎకరాకు 10 వేలు అందిస్తూ ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు జనం జేజేలు పలికారు. పలుచోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
అప్పుల బారి నుంచి విముక్తి కల్పించేందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి రైతు బాంధవుడిగా నిలిచారు. ప్రతి ఏటా పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ రైతులకు అండగా ఉంటున్నారు. గతంలో పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసేవారు. రైతుబంధు పథకంతో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
– సబితారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
రంగారెడ్డి, జూన్ 28, (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసే ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత ఎకరా వరకు భూమి రైతులకు రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, నేడు రెండు ఎకరాల భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నది. మొదటి రోజు ఎకరా భూమి 1,08,207 మంది రైతులకుగాను రూ.30.79 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది. రైతులు అప్పుల బారిన పడకుండా రైతుబంధు పథకంతో సాగు చేసుకునేందుకు ఆర్థికసాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలికాలు. అంతేకాకుండా జిల్లాలోని పలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి 3,68,559 మంది రైతులను రైతుబంధుకు అర్హులుగా గుర్తించారు. యాసంగితో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా 31,935 మంది రైతులు రైతుబంధుకు అర్హులుగా గుర్తించారు. రైతుబంధు పథకం కింద ఐదేండ్లలో ప్రభుత్వం రూ.2245 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకు రూ.257కోట్లు, యాసంగిలో 2,21,096మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 2,30,155 మందికి రూ.257 కోట్లు, యాసంగి సీజన్లో 1,87,804 మంది రైతులకు రూ.182 కోట్లు, 2020 వానకాలం సీజన్లో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344కోట్ల పెట్టుబడి, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్లు, గతేడాది యాసంగిలో రూ.280 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎకరాకు రూ.5వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
పరిగి, జూన్ 28 : వానకాలం సీజన్లో పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుబంధు కింద విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధుసాయం కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో మొత్తం 270232 మంది రైతులకు రూ.3193664616 మంజూరయ్యాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం 129037 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.70,95,72,120 జమ అయ్యాయి. రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతున్నది. మంగళవారం జిల్లాలోని బొంరాస్‌పేట్ మండలంలో 8464 మంది రైతులకు రూ.45748983, దౌల్తాబాద్‌లో 8361 మందికి రూ.46195815, కొడంగల్‌లో 7465 మందికి రూ.43168740, చౌడాపూర్‌లో 3881 మందికి రూ.20612273, దోమలో 6978 మందికి రూ.37201137, కులకచర్లలో 5243 మందికి రూ.28963431, పరిగిలో9027 మందికి రూ.48707338, పూడూరులో 8260 మందికి రూ.43660880, బషీరాబాద్‌లో 5291 మందికి రూ.31768140, పెద్దేముల్లో 5914 మందికి రూ.35673868, తాండూరులో 5690 మందికి రూ.32686174, యాలాల్లో 6050 మందికి రూ.33109092, బంట్వారంలో 3177 మందికి రూ.19941462, ధారూర్‌లో 7116 మందికి రూ.39045071, కోట్‌పల్లిలో 4264 మందికి రూ.24992684, మర్పల్లిలో 8058 మందికి రూ.45749364, మోమిన్‌పేట్‌లో 7206 మందికి రూ.37616174, నవాబుపేట్‌లో 8980 మందికి రూ.45225284, వికారాబాద్‌లో 9612 మందికి రూ.49506210 రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి రెండు సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధుసాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో రైతుబంధు డబ్బులు అందజేసి మేలు చేసిందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. రైతుబంధు డబ్బులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఫోన్లలో వచ్చిన మెసేజ్‌లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తలకొండపల్లిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
తలకొండపల్లి, జూన్ 28 : రైతుబంధు సహకారంతో రైతులు ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకుంటున్నారని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయినందున రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మార్చారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడిగా నిలిచారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్, ఉపసర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు మల్లేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత్, సజ్జుపాషా, చెన్నకేశవులు, శ్రీరాం, సత్తయ్య, గణేశ్, వెంకటాచారి, వెంకటయ్య, కృష్ణయ్య, శంకర్ పాల్గొన్నారు.
వికారాబాద్‌లో తన బ్యాంక్ ఖాతాలో జమైన పెట్టుబడి సాయం మెసేజ్‌ను చూపుతున్న మహిళా రైతు
అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట
రైతుబిడ్డగా అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయం అందించడం గొప్ప పరిణామం. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో రైతులంతా పంటలు సాగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
– పి. కృష్ణాయాదవ్, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
రైతు కష్టాలు తీరాయి
ప్రభుత్వం పెట్టుబడిసాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. పంటలు సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతు ఖాతాల్లో జమచేస్తున్నది. రైతుల కష్టాలను తెలుసుకొని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదములు.
– వెంకటయ్య, రైతు నాగసముందర్, ధారూరు మండలం
రైతుల అభ్యున్నతికే రైతుబంధు
పెట్టుబడిసాయంతో వానకాలంలో పంటలు వేసే సమయంలో రావడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు పథకం ద్వారా డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. ఆ బాధలు ఇప్పుడు తీరాయి.
– నర్సింహారెడ్డి, రైతు మోమిన్‌ఖుర్ధు, ధారూరు మండలం
సంతోషంగా ఉంది..
రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందింది. వానకాలం పంట సాగుకు ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉంది. రైతులకు ఈ పథకం ఓ వరంలా మారింది. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడిగా నిలిచారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నది.
– బోయిని దస్తప్ప, గౌతాపూర్, తాండూరు మండలం
పంట సాగుకు సాయం..
ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు పెట్టుబడిసాయంతోనే పంట సాగు చేస్తున్నా. సీఎం కేసీఆర్ రైతుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి పంట పెట్టుబడి ఖాతాలో పడినందుకు సంతోషంగా ఉంది. గతంలో కూడా రైతు బంధు పెట్టుబడితో ఉల్లిపంట సాగు చేశా. ఈ వానకాలంలో సమయానికి పెట్టుబడి సాయం రావడంతో అప్పుల బాధలు తప్పాయి.
– చిన్న నర్సింహులు, మిట్టబాసుపల్లి, తాండూరు
అప్పుల బాధలు తప్పాయి
ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం రైతుబంధు ద్వారా అందజేస్తున్న పెట్టుబడి సాయంతో అప్పులు చేసి వ్యవసాయం చేసే అవపరం లేకుండా పోయింది. సకాలంలో వానకాలం పంటలకు ఎకరాకు రూ.5వేలు అందించడం వల్లన పెట్టుబడికి ఉపయోగపడుతున్నది.
– కోతి మొగులయ్య రైతు, గాలిగూడ, జిల్లెడు చౌదరిగూడ మండలం
సకాలంలో అందాయి..
ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు డబ్బులు పంటలకు పెట్టుబడి సమయానికి అందుతున్నాయి. దీంతో అప్పులు తెచ్చుకునే అవసరం లేకుండా పోయింది. రైతుబంధు డబ్బులతో పంట పెట్టుబడి భారం తప్పుతున్నది. సకాలంలో డబ్బులు రావడం ద్వారా సాగుకు తోడ్పాటునందించినట్లు అవుతున్నది. –గోపాల్ రైతు, తుమ్మలపల్లి గ్రామం, జిల్లెడు చౌదరిగూడ మండలం
పెట్టుబడి సాయంతో ఆదుకుంటున్నడు…
ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అదునుకు లాగొడి సాయం అందించడం సంతోషకరం. గతంలో వర్షాకాలం వచ్చిదంటే పంటలు సాగు చేయాలంటే శావుకారి వద్ద విత్తనాలు, ఎరువులు ఉద్దెర తెచ్చుకునేటోళ్లం. పంట దిగుబడి వచ్చినంకా అప్పులే మిగిలేయి. ప్రస్తుతం రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు సాయం అందించి ఆదుకోవడం గొప్ప నిర్ణయం.
– అంజయ్య, అంతిరెడ్డిగూడ (షాబాద్)