రైతుభరోసా పెట్టుబడి సాయం జిల్లాలో సగం మందికే అందడంతో మిగిలిన అర్హులైన రైతులు తమకెప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారని వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా, జిల్లాలో 3,12,872 మందిని అధికారులు అర్హులుగా గుర్తించి.. ఇప్పటివరకు మూడెకరాల్లోపు గల 1,74,495 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ముఖ్యంగా రైతులను నట్టేట ముంచుతున్నది. కేసీఆర్ హయాంలో పదేండ్లపాటు సీజన్‌కు ముందే పెట్టుబడి సా యాన్ని అందించి అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకున్నది. మోసపూరిత హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతుభరోసాను ఏడాదికి రూ.15,000 అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12,000 తగ్గించింది. ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతా ల్లో టింగ్టింగ్ మంటూ రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామన్న మాటను కూడా సక్రమంగా నిలబెట్టుకోలేకపోయింది.
విడతల వారీగా రైతుభరోసా పెట్టుబడి సా యాన్ని జమ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మొదట మండలానికి ఒక గ్రామాన్ని చొప్పు న ఎంపిక చేసి.. తదనంతరం ఎకరం, రెండెకరాలు, తదనంతరం ఇప్పటివరకు మూడెకరాల వరకు పెట్టుబడి సాయాన్ని రైతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో అర్హులుగా గుర్తించిన రైతుల్లో కేవలం సగం మందికే పెట్టుబడి సా యం అందింది. మిగతా రైతులు తమకు సా యం ఎప్పుడు అందుతుందని వ్యవసా య శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో 3,12,872 మందిని అధికారులు అర్హులుగా గుర్తించి రూ.385. 46 కోట్ల సాయాన్ని అందించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు మూడెకరాల్లోపుగల 1,74,495 మంది రైతులకు రూ. 143.13 కోట్ల రైతుభరోసా సాయాన్ని మాత్రమే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగతా రైతులకు రైతుభరోసా సాయం ఎప్పుడు జమ అవుతుందనేది అధికారుల కూ స్పష్టత లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొచ్చిన రైతుభరోసాపై రైతాంగం భగ్గుమంటున్నది. పెట్టుబడి సా యాన్ని కొద్దిమందికే అందించి మిగిలిన వారికి ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీజన్‌కు ముందే..
గత కేసీఆర్ హయాంలో ప్రతి ఏటా సీజన్‌కు ముందే ఎకరానికి రెండు సార్లు రూ. ఐదు వేల చొప్పున రైతుబంధు సాయాన్ని అందించింది. దీంతో అన్నదాతలు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను సాగు చేసుకున్నారు. జిల్లాలో 12,35,000 ఎకరాల్లో వ్యవసాయ భూములుండగా.. ప్రతి సీజన్లో 6,20,000 ఎకరాల వరకు రైతుబంధు సాయాన్ని అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద పెట్టుబడి సాయానికి దాదాపు 40,000 ఎకరాలను తగ్గించి 5,80,000 ఎకరాలకు తగ్గించిం ది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద రూ. 2,926 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది.
2018 వానకాలంలో 1,94,833 మం దికి రూ.221 కోట్లు, యాసంగిలో 1,75, 989 మందికి రూ.206 కోట్లు, 2019 వానకాలంలో 1,78,998 మందికి రూ.255 కోట్లు, యాసంగిలో 1,71,824 మందికి రూ.194 కోట్లు, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మందికి రూ.301 కోట్లు, 2021 వానకాలంలో 2,25,438 మందికి రూ.300 కోట్లు, యాసంగిలో 2,24,928 మందికి రూ.241 కోట్లు, 2022-23 వానకాలం లో 2,47,707 మందికి రూ.305 కోట్లు, యాసంగిలో 2,43,447 మందికి రూ. 299 కోట్లు, 2023-24 వానకాలంలో 2,62,065 మందికి రూ.307.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకనికి రూ.5 వేల చొప్పున నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.