వికారాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత సతమతమవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా మద్దతు ధర అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది.
ధాన్యాన్ని రైతులు సిద్ధం చేసి నెల రోజులు అవుతున్నది. గత రెండు, మూ డు రోజులుగా ధాన్యం సేకరణ స్పీడందుకోగా సేకరణలోనూ రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్యాయం చేస్తున్నారు. తరుగు పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. క్వింటాల్‌కు 5-10 కిలోల వరకు తరుగు పేరిట మోసం చేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తుండగా, తరుగు ఒక్కో బస్తాకు 2-4 కిలోలు తీస్తుండడం గమనార్హం. క్వింటాకు 5-10 కిలోల వరకు అదనంగా తూకం వేస్తూ తరుగు పేరిట రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో యాసంగి వరి కోతలు పూర్తై గత నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. కల్లాలు, రోడ్లు, ఇండ్ల ఎదుట ధాన్యాన్ని ఆరబెట్టి ఎప్పుడు ప్రభుత్వం కొంటుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రతిఏటా ఈ సమయానికి ధాన్యం సేకరణ ముగిసే పరిస్థితులుండగా, ఈ ఏడాది మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో వడ్ల సేకరణ జరుగుతున్నది. మొదట ప్రజాప్రతినిధుల అపాయింట్‌మెంట్‌కోసం ఎదురుచూసిన అధికారులు తదనంతరం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తూకం మాత్రం వేయలేదు.
వారం, పది రోజులు ట్యాబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించే సిబ్బంది జిల్లాలో ఎవరు లేకపోవడంతో ధాన్యం సేకరణను సంబంధిత అధికారులు నిలిపివేసినట్టు తెలిసింది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 12,147 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించా రు. మరోవైపు జిల్లాలో అధికారులు 129 కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించగా, ఇప్పటివరకు కేవలం 25 కేంద్రాల్లోనే సేకరణ జరుగుతున్నది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 8 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14 కేంద్రాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తున్నారు.
ఇప్పటివరకు 212 మంది రైతుల నుంచి 12,147 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న 5 కేంద్రాల్లో మాత్రమే 1000 మెట్రిక్ టన్నులకు మించి సేకరించగా.. మిగిలిన కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల్లోపే. మరోవైపు ఇప్పటివరకు రూ.2.90 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించగా, రూ.1.04 కోట్ల చెల్లింపులు మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కాగా, జిల్లాలో ఈ యాసంగిలో లక్షా5 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 42 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 49 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు మద్దతు ధర రూ.2389, సాధారణ రకానికి రూ.2369లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్‌ను అందించేందుకు నిర్ణయించారు.