న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ ; ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టిన దామగుండంలోని నేవీ రాడార్ విషయంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు.. అలవికాని హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తుండడంతో మంగళవారం నిరసనలు, దీక్షలు చేపట్టారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో ఫోర్త్‌సిటీ రోడ్డు ఏర్పాటు కోసం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగి అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులపై ఆంక్షలను ఎత్తివేసి, సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇబ్రహీంపట్నం బస్‌డిపో ఎదుట ఆందోళన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికారాబాద్, ఆదిబట్లలో నిరసనలు చేపట్టారు. రాష్ట్ర సర్కార్ ప్రజలను క్షోభకు గురిచేస్తున్నదని.. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని.. లేదంటే రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతామని ఉమ్మడి జిల్లావాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
కలెక్టరేట్ వద్ద చస్తాం..
ఉన్న కాస్తా పొలం ఫోర్త్‌సిటీ రోడ్డు కోసం పోతే తాము ఎలా బతకాలని అన్న దాతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో ఫోర్త్‌సిటీ రోడ్డు ఏర్పాటు కోసం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగి అడుగడుగునా అడ్డుకున్నారు. సమాచారం లేకుండా తమ భూముల్లో ఎందుకు సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకుని రైతులను ఆదిబట్ల ఠాణాకు తరలించేందుకు యత్నించినా.. సర్వే పనులను మాత్రం సాగనివ్వలేదు. దీంతో వారిని బలవంతంగా ఠాణాకు తీసు కెళ్లగా.. మహిళలను అక్కడి నుంచి నెట్టి వేసి.. పోలీసుల బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. రోడ్డు కోసం 300 ఫీట్ల రోడ్డు ఎందుకు, 200 ఫీట్లు అయితే అందరం సంతోషంగా ఇస్తామన్నారు. భూమి పోతే మాకు ఆత్మహత్యే శరణ్యమని, కలెక్టరేట్ వద్ద చస్తామని హెచ్చరించారు. అక్కడే ఉన్న శ్రీనివాస్ అనే రైతు సర్వే పనులను నిలిపేయాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా అతడి వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి..
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి వెంటనే సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం బస్‌డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, ప్రజాతంత్ర హక్కులను పునరుద్ధరించాలన్నారు. కార్మికుల వేతనంపై పీఆర్సీ అమలు చేశారే తప్పా.. హెచ్ఆర్ఏ, డీఏ, స్టాండింగ్ అలవెన్స్, నైట్‌ఔట్ అలవెన్స్ డే అవుట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ యూనియన్ కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ కార్మికులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు హామీలు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పోచమోని కృష్ణ, ఎల్లేశ్, బుగ్గ రాములు, చందూనాయక్, సత్యనారాయణ, యాదగిరి, విఘ్నేశ్, యాదయ్య, వీరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.