ఆమనగల్లు, మే 26 : ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే.. అక్కడి సిబ్బంది తూకం వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ధాన్యం రాశులుగా నిండిపోయింది. అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
కడుపు మండిన రైతన్న తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని.. కొనుగోళ్ల అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నాకు దిగగా .. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని నెట్టివేయడంతోపాటు, బలవంతంగా అరెస్టు చేసి ఆమనగల్లు ఠాణాకు తరలించారు.
అక్కడికి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చేరుకుని అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను పరామర్శించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుని తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రానికి తీసుకొచ్చి 25 రోజులు దాటినా తూకం వేయరా.. అని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని.. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు అర్జున్‌రావు, పరమేశ్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ సత్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ వీరయ్య, సీనియర్ నాయకులు నిరంజన్‌గౌడ్, శ్రీను, శ్రీనూనాయక్, పంతూనాయక్, రమేశ్, శంకర్, ఆంజనేయులు, ప్రసాద్, రమేశ్‌నాయక్, గణేశ్ తదితరులున్నారు.