జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుపై రైతాంగం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పంట సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రచారం చేయకపోవడం..నీటి కొరత, కరెంట్ కోతల వంటి పరిస్థితులతోనే రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. గతేడాది జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా.. మూడు వేల ఎకరాల లక్ష్యానికిగానూ ప్రభుత్వం నుంచి 1,310 ఎకరాలకు మాత్రమే పరిపాలనా అను మతులొచ్చాయి.
అయితే ఇప్పటివరకు రైతులు 854 ఎకరాల్లోనే పంటను సాగు చేశారు. ఈ మాత్రం సాగు గత బీఆర్ఎస్ హయాంలోనే కాగా.. రేవంత్ ప్రభుత్వంలో కొత్తగా సాగైందీ ఏమీలేదు. గత లక్ష్యమే పూర్తికాకపోవడంతో.. కొత్తగా టార్గెట్‌ను నిర్దేశించుకునే సాహసాన్ని ఉద్యానవన శాఖ అధికారులు చేయలేకపో తున్నా రు. ఈ పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతులను చైతన్యపర్చేందుకు సంబం ధిత శాఖ అధికారులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
ప్రోత్సాహం అందిస్తున్నా..
రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇతోధికంగా సబ్సిడీ ఇస్తున్నది. ఎకరంలో ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతుకు రూ.50,600 రాయితీ ఇస్తున్నది. ఎకరంలో 57 మొక్కలు నాటాల్సి ఉండగా..ఒక్కొక్క మొక్కకు రూ.200 ధర ఉంటుంది. ఈ లెక్కన రెండు వందల మొక్కలకు రూ.11,400 అవుతుండగా ..ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. రైతు వాటా కింద రూ.1,140 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే డ్రిప్ కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు అవుతుండగా.. రైతు వాటా కింద రూ.7వేలు చెల్లిస్తే మిగతా రూ.23 వేల వరకు ప్రభుత్వం భరిస్తుంది. డ్రిప్ సిస్టమ్ కోసం బీసీలకు 90 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ వర్తిస్తున్నది.
పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉన్నది. అలాగే మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు కాత రాదు. ఈ సమయంలో మొక్కల సంరక్షణతోపాటు ఆయిల్ పామ్ అంతర పంటల సాగు కోసం ప్రభుత్వం రూ.4,200 చొప్పన నాలుగేండ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. రైతులు కేవలం గుంతలు తీసుకుని మొక్కలు, డ్రిప్ కోసం రూ.8,140 చెల్లిస్తే సరిపోతుంది. ఈ సాగుతో నాలుగేండ్ల తర్వాత నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయాన్ని పొందొచ్చు. పదేండ్ల తర్వాత ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఆయిల్ పామ్ సాగుకు గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నివ్వగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరోపక్క నీరు, కరెంటు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ పంట సాగుకు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. అయితే భూముల ధరలకు ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్ పామ్వైపు రైతులు మొగ్గు చూపడంలేదని అధికారులు మరో కారణంగా చెబుతున్నారు.
25న మెగా ప్లాంటేషన్..
ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించి రైతు లను చైతన్యపర్చేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే లాభదాయకంగా సాగు చేస్తున్న ఆదర్శ రైతులను పరిచయం చేసేందుకు ఖమ్మం, సిద్దిపేట తదితర ప్రాంతాలకు జిల్లా రైతులను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా ఉద్యాన వన శాఖ సన్నాహాలు చేస్తున్నది. 18 మండలాల పరిధిలో 96 మంది రైతులకు సంబంధించిన 300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతులు ఈ సాగుపై దృష్టిసారించాలి..
జిల్లా రైతులు ఆయిల్‌పామ్ వైపు దృష్టి సారించాలి. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను అందిస్తున్నది. మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంటల విక్రయాల వరకు ఉద్యాన అండగా ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ పామ్ తోటలు సాగు అవుతున్న ప్రాంతాలకు రైతులను తీసుకెళ్లి చూపిస్తు న్నాం. రైతువేదికల్లోనూ సమావేశాలు నిర్వహించి చైతన్యపరుస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 25న మెగా ప్లాంటేషన్‌ను చేపడుతున్నాం.
-కె.సురేశ్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి,
రంగారెడ్డి
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఇలా..
కేటాయింపులు : ఎకరానికి రాయితీ (రూ.లలో)
మొక్కలకు (ఎకరానికి 50-57 మొక్కలు) : 11,600
మొదటి ఏడాది ఎరువులు, అంతర పంటలకు : 4,200
రెండో ఏడాది : 4,200
మూడో ఏడాది : 4,200
నాల్గో ఏడాది : 4,200
బిందు సేద్యం : 22,518