రంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవటంతో అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవల్సిన పరిస్థితి దాపురించింది. గత యాసంగి సీజనల్లో వరి కోతల ముగింపు సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో సగానికి పైగా ధాన్యం దళారుల వద్దనే అమ్ముకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సన్నాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కారు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు.
వర్షాకాలం పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం 34 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో 20 కేంద్రాలు పీఏసీఎస్‌లకు, 4 కేంద్రాలు డీసీఎంఎస్‌కు, 10 కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389., తేమ తక్కువ ఉన్న వడ్లకు రూ.2,369గా ప్రకటించింది. అలాగే, సన్నవడ్ల కొనుగోలుపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఈ వర్షాకాలం సీజన్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 1.25 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేయగా.. అధికారుల అంచనాలకు మించి ధాన్యం వస్తుందని రైతులు చెప్తున్నారు.
సకాలంలో కేంద్రాలను ఏర్పాటు చేయాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ముగిసిన తర్వాత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య దళారులు తమకు నచ్చిన ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ సామాన్య రైతులను నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్ : వ్యవసాయ మార్కెట్ యార్డులతో పాటు అన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే రైతులు తమ పంటను కోసి ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారని, పలువురు రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని వాపోయారు. పంట కోతకొచ్చిందని తెలిసి కూడా సర్కారు ఇప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ యేడు మొక్కజొన్న పంట అధికంగా దిగుబడి అయ్యే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 చెల్లించేలా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలు లేక రైతులు పంటను తక్కువకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు షాద్‌నగర్ డివిజన్లోని అన్ని క్లస్టర్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.