పంట రుణాలు మాఫీ అవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన రైతన్నకు భంగపాటే మిగిలింది. ప్రభుత్వం విధించిన నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. అన్ని అర్హతలున్నా మా క్రాప్ లోన్ ఎందుకు మాఫీ కాలేదని తెలుసుకునేందుకు అన్నదాతలు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు ఎలాం టి షరతుల్లేకుండా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే.. అనేక కొర్రీలు, మెలికలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిగి మండలంలోని చిగురాల్‌పల్లి గ్రామంలో రుణాలు తీసుకున్న వారిలో 40 శాతం మందికే మాఫీ వర్తించడం తో.. మిగిలిన రైతులు మా రుణాలు మాఫీ అవుతాయా.. లేవా..? అని ఆందోళన చెందుతున్నారు.
Runa Mafi | పరిగి, ఆగస్టు 25 : అర్హులైన వారికి కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. ఒకవైపు ప్రభుత్వం అర్హులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొంటుండగా.. రుణమాఫీ కాని అర్హులు మా లోన్ ఎందుకు మాఫీ లేదని తెలుసుకునేందుకు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరిని అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అసలు మాకు రుణమాఫీ అవుతుందా లేదా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు ఎలాంటి షరతుల్లేకుండా పంట రుణాలను మాఫీ చేస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికా రంలోకి రాగానే.. అనేక కొర్రీలు, మెలికలు పెట్టడంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే విడతలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి తీరా మూడు విడుతల్లో ప్రక్రియను తూతూమంత్రంగా పూర్తి చేయడంపై మండిపడుతున్నారు. పరిగి మండలంలోని చిగురాల్‌పల్లి గ్రామంలో రుణాలు తీసుకున్న వారిలో 40 శాతం మందికే రుణమాఫీ వర్తించడం గమనార్హం. ఈ గ్రామంలో సుమారు 700 పైచిలుకు రైతులున్నారు. పరిగిలోని యూనియన్ బ్యాంకు, పీఏసీఎస్‌లలో వారు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో చిగురాల్‌పల్లిలో లక్ష లోపు 95 మందికి, రెండోవిడతలో లక్షన్నర వరకు 39 మందికి రుణమాఫీ కాగా.. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా వివరాలను పంపించడంతో పూర్తిస్థాయిలో ఎంతమందికి వర్తించిం దనే విషయాన్ని సైతం అధికారులు చెప్పలేకపోతున్నారు.
ఎన్నికల హామీల్లో భాగంగా రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి తీరా కొంతమంది రుణాలే మాఫీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌కార్డు, కొర్రీలు లేకుండా అందరి రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చారని.. రైతుబంధు పథకంతో ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించేవారని గుర్తు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడం లేదని మండిపడుతున్నారు. గత యాసంగిలో కొంతమందికే పెట్టుబడిసాయాన్ని అందించగా.. ఈ వాన కాలంలో ఇప్పటివరకూ రైతుబంధు సాయాన్ని ఇవ్వలేదని.. ప్రజాప్రభుత్వం అంటూ అన్నదాతల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు 3.8 ఎకరాల భూమి ఉన్నది. పరిగిలోని యూనియన్ బ్యాంకులో రూ.1.80 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీబీలో రూ.1.60 లక్షలు పంటల సాగు కోసం తీసుకున్నా. నాకు తెల్ల రేషన్‌కార్డు ఉన్నా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రైతు పేరిట ఎంత రుణం ఉన్నా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందే. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రూ. రెండు లక్షల వరకు మాఫీ చేస్తే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తా. ప్రభుత్వం హామీ నెరవేర్చకుండానే గొప్పలు చెప్పుకోవడం తగదు.
– శేరి చిన్నయ్య, చిగురాల్‌పల్లి, పరిగి
నాకు 4.05 ఎకరాల భూమి ఉన్నది. యూనియన్ బ్యాంకులో రూ.1,60,000 రుణం తీసు కున్నా. మూడు విడతల్లోనూ నా క్రాప్ లోన్ మాఫీ అయినట్లు మెసేజ్ మాత్రం రాలేదు. ఇదే విష యాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రాసెస్‌లో ఉందని చెబుతున్నారు. అన్ని అర్హతలున్నా నా రుణం ఎందుకు మాఫీ కాలేదు? ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అందరి రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి.
– మోముల ఆంజనేయులు, చిగురాల్‌పల్లి, పరిగి