కడ్తాల్, జూన్ 1: రేవంత్రెడ్డి సర్కార్లో అన్నదాతలకు అన్ని విధాల మోసం జరుగుతుందని బీఆర్ఎస్ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సర్కార్ అలవికానీ హామీలనిచ్చిందని తెలిపారు.
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగల్లోకి తొక్కిందని చేగూరి మహేశ్ విమర్శించారు. ఈ యేడు వానాకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్న రైతు భరోసా పథకం అమలుపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజించుకున్నప్పటి నుంచి రైతులను పట్టించుకున్న పాపానపోలేదని ధ్వజమెత్తారు. పంట పెట్టుబడిసాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు వేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.6 వేలు ఇచ్చిందని మండిపడ్డారు. యాసంగి పంట సాగులో నాలుగెకరాల వరకు పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు.