వికారాబాద్, జూలై 24 : వికారాబాద్ మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకుగాను వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కురుస్తున్న వర్షాలతో పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాతలు యూరియాను కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలిచి ఉంటే కేవలం నాలుగు బస్తాలు మాత్రమే దొరుకుతున్నాయి. పంట సాగుకు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాలు త్వరగా అయిపోవడంతో మరుసటి రోజు రావాలంటున్నారని.. అయితే ప్రతి రోజూ ఇదే తీరు కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నదాతలు వ్యవసాయాధికారులను కోరుతున్నారు.
యూరియా కొరత
కేశంపేట : మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు గురువారం పడిగాపులు కాశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చిన రైతులు దుకాణాల ఎదుట బారులు తీరారు. రైతుల తాకిడి అధికం కావడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో యూరియాను అందజేశారు. రైతులకు సరిపడా యూరియా రాలేదన్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఏవో శిరీషతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియాను అందజేయాలని కోరారు. మొక్కజొన్న, పత్తి పంటలను అధికంగా సాగు చేశారని, దానికితోడు వరినాట్లు వేసే సమయం కావడంతో యూరియా కొరత ఏర్పడినట్లు ఏవో తెలిపారు.
నాకు యూరియా దొరకలేదు
వర్షాలు కురుస్తున్నందున పత్తి, మొక్కజొన్న పంటలకు సరిపడు యూరియాను కొనుగోలు చేసేందుకు వికారాబాద్‌కు వచ్చాను. ఇక్కడ ఉన్న స్టాక్ వరకే ఆధార్ కార్డుల ఆధారంగా ఇస్తామన్నారు. నాకు కావాలని అడిగితే యూరియా అయిపోయింది. తరువాత రావాలని తిప్పి పంపిస్తున్నారు. నాకు 12 ఎకరాల భూమి ఉన్నది. నాలుగు బస్తాల యూరియా ఇస్తే ఏం సరిపోతుంది. పంటలు ఎలా సాగు చేసుకోవాలి. అధికారులు స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచి సరఫరా చేయాలి.
– ప్రవీణ్, గొట్టిముక్కల, వికారాబాద్
నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు
నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేసుకుంటున్నాను. కురిసిన వర్షాల వల్ల పంటకు తగిన మోతాదులో యూరియాను అందించాల్సి ఉంటుంది. నాలుగు బస్తాలు మాత్రమే అని లిమిట్ పెట్టడంతో పంటకు సరిపోవడంలేదు. ఒక్క యూరియ బస్తాకు రూ.290. కాగా.. ఆటోలో నాలుగు బస్తాల యూరియాను తీసుకెళ్తే దాదాపు రూ.500లకు పైగా ఖర్చవుతున్నది. మరోసారి యూరియా తీసుకెళ్లాలంటే మరోసారి ఆటో ఖర్చులు పెరుగుతాయి.
– రవి, మద్గుల్‌చిట్టంపల్లి తండా(టేకులబీడుతండా), వికారాబాద్