వికారాబాద్, సెప్టెంబర్ 14 : రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు. అర్ధరాత్రి వేళ యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం వస్తే రేపు.. ఎల్లుండి అంటూ తిరిగి పంపిస్తున్నారని వాపోతున్నారు. ఆదివారం వికారాబాద్‌లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులకు కేవలం వికారాబాద్ మండల రైతులకు మాత్రమే యూరియా పంపిణీ అని చెప్పడంతో ఆయా గ్రామాల అన్నదాతలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో వేచి ఉండి.. నీరు తిండి లేక పస్తులుంటే.. ఇవ్వకపోతే ఎట్లా అని మండిపడ్డారు. రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నవాబుపేటలో కూడా ఆదివారం యూరియా కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద అన్నదాతలు బారులు తీరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రైతన్నలు చీదరించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత లేదని అన్నదాతలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
సరిపడు యూరియా అందించాలి
ధారూరు మండలంలో యూరియా దొరకడంలేదు. పంటలు సాగు కోసం యూరియా కొనుగోలు చేసేందుకు వికారాబాద్‌కు వచ్చాను. ఇదివరకు యూరియా కోసం వస్తే ఆదివారం ఉదయం 7 గంటలకు రావాలని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6 గంటలకు షాపునకు వెళ్లి క్యూలో ఉన్నాను. 11 గంటలకు ఇతర మండలాలకు చెందిన రైతులకు యూరియా ఇవ్వబోమని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే .. వికారాబాద్ రైతులకే ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.
– నర్సింహులు, మున్నూర్ సోమారం, ధారూరు
అర్ధరాత్రి యూరియా తరలిపోతున్నది
గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి యూరియా లోడ్ రావడంతో .. వచ్చిన కొద్ది సేపటికే ఇతర వాహనాల్లో యూరియాను తరలిస్తున్నారు. అర్ధరాత్రి 2 నుంచి 4:30 గంటల వరకు యూరియా సరఫరా జరుగుతున్నది. బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతోనే రైతులకు యూరియా కష్టాలు వస్తున్నాయి. అసలైన రైతులను గుర్తించి వారికి అవసరమైన యూరియాను అందిస్తే ప్రయోజనం కలుగుతుంది. కేసీఆర్ పాలనలో అన్నదాతలు యూరియా కోసం ఇంతలా ఇబ్బందులు పడలేదు.
– మహిపాల్, మద్గుల్‌చిట్టంపల్లి, వికారాబాద్
తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నాం
శనివారం రాత్రి యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్నాం. తెల్లవారుజామున వికారాబాద్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి వచ్చాను. షాపు ఎప్పుడు తెరుస్తారో అని క్యూలో నిలుచున్నాను. శనివారం వస్తే యూరియా దొరకలేదు. పంటలకు యూరియా లేకపోతే పంటలు సక్రమంగా పండవు. పంట చేతికి రాకపోతే చేసిన అప్పులు తీరవు. యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. అధికారులు స్పందించి రైతులకు సరిపడు యూరియా అందించాలి.
– బలరాం, మున్నూర్ సోమారం, ధారూరు