రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/కేశంపేట : వరికి బదులుగా మొక్కజొన్న పంటను సాగు చేసిన అన్నదాతకు ముప్పుతిప్పలు తప్పడంలేదు. జిల్లా లో వాతావరణ పరిస్థితులతో రైతన్నకు నష్టాలు తప్పేలా లేవు. పంట కంకులు పెట్టే సమయంలో సరిపడా నీరందక ఎండుముఖం పడుతున్న ది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకున్నా.. అప్పులు తీసుకొచ్చి పంట ను సాగు చేశామని.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో 13,600 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు.
షాద్నగర్, కేశంపేట, కొం దుర్గు, చౌదరిగూడ, షాబాద్, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాల్లో అధికంగా సాగు చేయ గా.. పంట ఆశాజనకంగా లేకపోవడంతో దానిని పశువుల మేతకు వదిలిపెట్టారు. మరోవైపు పంటలు ఎం డి పోతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నా..
చేతికొచ్చిన కొడుకులకు చేయూతనిచ్చేందుకు రూ.7 లక్షల వరకు అప్పులు చేసి మాకున్న భూమిలో మూడు బోర్లు తవ్వించా. ఆ పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేయ గా.. రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో ఆ బోర్లలోని నీరు ఇంకిపోయి పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోయింది. నా భర్త కృష్ణయ్య 15 ఏండ్ల కిందట మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా కాయకష్టం చేసి కుమారులను పెంచి పెద్ద చేశా. మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోవడం తీవ్రంగా కుంగదీసింది. బోర్లు వేయించేందుకు చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోతున్నా.
– రాములమ్మ, రైతు, కేశంపేట
పంట పూర్తిగా దెబ్బతిన్నది..
నా పొలంలో నాలుగు బోర్లు ఉండడంతో నీటికి కొదవ ఉండదనే ధీమాతో 3.5 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. ఎండలు ముదరడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు మరో బోరు తవ్వించినా చుక్కనీరు రాలేదు. పంటల సాగుకు తీసుకొచ్చిన అప్పులు.. ఐదు బోర్లు వేయించేందుకు చేసిన అప్పును ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి
– కుమ్మరి లింగం, రైతు, సంతాపూర్,కేశంపేట