రంగారెడ్డి, జూలై 18(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గురువారం తొలివిడతలో రూ.లక్ష రుణాలను మాఫీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 49,741 మందికే రూ.లక్ష రుణమాఫీ సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం సంబంధిత అధికారులకు పంపించింది.
ఇందుకు రూ.278.06కోట్లను బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. రైతు వేదికల్లో ఇందుకు సంబంధించి గురువారం అధికారులు ఏర్పాట్లు చేయగా.. చాలామంది రైతులు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో! లేవో? అని ఆరా తీయడం కనిపించింది. అయితే ఆయా జాబితాల్లో చాలామంది రైతుల పేర్లు లేనట్లు తెలుస్తుండగా.. నిబంధనలతో ప్రభుత్వం తమకు మొండిచేయి చూపిందా! అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఆశలు వదులుకుంటున్న రైతాంగం..
రుణమాఫీ అమలుపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం.. అనేక రకాల కొర్రీలు పెడుతుండడం రైతాంగానికి ఆగ్రహం తెప్పిస్తున్నది. రేషన్ కార్డును ప్రామాణికం చేస్తామనడం.. రూ.2లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడం.. కిసాన్ యోజన పథకం నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడం.. అయోమయానికి గురి చేస్తున్నది. అర్హులందరికీ వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులకు నమ్మకం కుదరడం లేదు. గురువారం రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు ఆశలు వదులుకున్నారు. ఆంక్షలతోనే తమకు రాలేదేమో! అన్న అనుమానాలను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 74,701 మందికి లబ్ధి..
కేసీఆర్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో 74,701 మంది రైతులకు రూ.420కోట్ల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలను కేవలం 49,741 మందికే వర్తింపజేస్తున్నది. ఇందుకుగాను రూ.278.06 కోట్లతో సరిపెడుతున్నది. గతంతో పోలిస్తే.. అర్హుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అస్తవ్యస్త విధానాలే కారణమని రైతాంగం పేర్కొంటున్నది.
రైతు సేవా సంఘాలకు మాఫీ ఉన్నట్లేనా!
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రూ.లక్ష రుణమాఫీకి కేవలం 310 మంది రైతులే అర్హులుగా ఉన్నట్లు జాబితా స్పష్టం చేస్తున్నది. అయితే అబ్దుల్దాపూర్ మెట్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘంలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారి రైతుల పేర్లు ఈ జాబితాలో లేనట్లు తెలుస్తున్నది. ఈ సహకార సంఘం సుమారు 23 గ్రామాల పరిధిలోని రైతులకు రుణాలను అందజేస్తూ వస్తున్నది.
ఈ క్రమంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 623 మంది ఉండగా.. రూ.1.50లక్షలు రుణాలు తీసుకున్నవారు ఇద్దరు, రూ.2లక్షల లోపు తీసుకున్నవారు 9 మంది వరకు ఉన్నారు. అయితే తొలి విడత జాబితాలో సహకార సంఘం నుంచి రుణాలు పొందిన రైతుల పేర్లు లేకపోవడంపై పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి పేర్లు మాత్రమే తొలి జాబితాలో వచ్చినట్లు తెలుస్తున్నది. తర్వాత జాబితా వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ నమ్మకం కుదరడం లేదని రైతులు చెబుతున్నారు. రైతు సేవా సంఘాలకు సంబంధించిన రుణాలకు మాఫీ వర్తిస్తుందా? లేదా! అన్న సందేహాలను సైతం రైతులు వ్యక్తం చేస్తున్నారు.
ఆ మండలాల్లో ఒకే ఒక్కడు..
హయత్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున మాత్రమే రూ.లక్ష రుణమాఫీ జాబితాలో చోటు దక్కింది. హయత్‌నగర్‌లో రూ.83,671 రుణానికి సంబంధించి ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించింది. అలాగే రాజేంద్రనగర్ మండలంలో రూ.68,670 రుణానికి సంబంధించి ఒకే ఒక్కరు రుణమాఫీకి అర్హులుగా తేల్చారు. గండిపేట మండలంలో 29 మంది, బాలాపూర్ మండలంలో 118 మంది చొప్పున అతి తక్కువ మంది రైతులను రూ.లక్ష రుణమాఫీకి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది.
వికారాబాద్ జిల్లాలో సగం మందికే..
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పెట్టిన నిబంధనలతో జిల్లాలో సగం మంది రైతులకు లబ్ధి చేకూరడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు పంట రుణాలకు సంబంధించి 1.06 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరితే, ప్రస్తుతం కాంగ్రెస్ పెట్టిన కొర్రీలతో కేవలం 46,633 మందికి సంబంధించిన రూ.256.26 కోట్ల మాఫీ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలను పరిగణనలోకి తీసుకొని మాఫీ చేసింది. అయితే కాంగ్రెస్ రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే దాదాపు 50 వేల మంది నష్టపోయినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీలోనూ కొర్రీలు పెట్టి అర్హులైన రైతులను రుణమాఫీకి దూరం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో..
గతంలో కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో 74,701 మంది రైతులకు రూ.420కోట్ల రుణాలను మాఫీ చేయగా.. వికారా బాద్ జిల్లాలో 1.06 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలను మాఫీ చేసి లబ్ధి చేకూర్చింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో..
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో కేవలం 49,741 మందికి చెందిన రూ.278.06 కోట్లను మాఫీ చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో కేవలం 46,633 మందికి చెందిన రూ.256.26 కోట్లను మాఫీ చేస్తున్నది. కొర్రీలతో సగానికి పైగా మంది రుణమాఫీకి దూరమయ్యారు.
అర్హతలున్నా రుణ మాఫీ కాలేదు..
నాకు 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. రెండేండ్ల క్రితం మేకగూడ సొసైటీ బ్యాంకులో రూ.40 వేల రుణం తీసుకున్నాను. మా నాన్న పేరు మీద రేషన్ కార్డు ఉన్నది. నాపేరు మీద లేదు. వ్యవసాయ అధికారులు ప్రకటింకచిన లిస్ట్‌లో నా పేరు లేదు. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే లిస్ట్‌లో పేరు రాకపోతే ఫిర్యాదు చేయడానికి తమ వద్ద ఎలాంటి సదుపాయం లేదని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా నాకు పంట రుణం మాఫీ కాలేదు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తీరా చూస్తే లిస్టులో నా పేరు రాలేదు. నాకు న్యాయం చేయాలి.
-సంగెం ఆంజనేయులు, శేరిగూడ భద్రాయిపల్లి, కొత్తూరు మండలం
రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ చేసిన జాబితాలో నా పేరు లేదు. నేను గతేడాదే రూ.50వేల రుణం స్థానికంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో తీసుకున్నాను. లక్ష రూపాయల లోపు విడతలోనే నా రుణం మాఫీ కావాల్సి ఉన్నది. అయినా నా పేరు జాబితాలో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు నా రుణం మాఫీ చేస్తారో తెలియడం లేదు.
-బార్వాది భరత్‌కుమార్, బంట్వారం
రుణమాఫీ కాకపోవడంతో నిరాశ చెందా..
నేను 2019లో రెండు ఎకరాల భూమిపై సుమారు రూ.60వేల రుణం బ్యాంకులో తీసుకున్నాను. నా భార్య కిష్టమ్మ పేరుమీద ఉన్న భూమిపై కూడా రుణం తీసుకున్నాను. సీఎం రేవంత్‌డ్డి రుణమాఫీ చేస్తాడని ఆశగా ఎదురుచూశాం. కానీ మాకు మాత్రం నిరాశే మిగిలింది. అన్ని అర్హతలు ఉన్నా మాకు రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థంకావడం లేదు. అధికారులు స్పందించి రుణమాఫీ చేయాలి.
-రెబ్బనమోని వెంకటయ్య, రైతు విఠ్యాల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం, షాద్‌నగర్
Sss