రంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ) ; రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఏక కాలంలో సర్వే చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. కొంతమంది సిబ్బందికి సరైన శిక్షణ లేని కారణంగా నిదానంగా, గందరగోళంగా సాగుతున్నది. ప్రభుత్వం ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 కుటుంబాలకు పైగానే అప్పగించడం.. ఒక్కో ఎన్యూమరేటర్ ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిం చేందుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతున్నది. కుటుంబ యజమానులు అందుబాటులో లేకుంటే మళ్లీ ఆ ఇండ్లకు వెళ్లి సర్వే చేపట్టాల్సిన పరిస్థితి ఉండడంతో.. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఈ సర్వే పూర్తవుతుందా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి.
వికారాబాద్ జిల్లాలో..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించగా.. శనివారం నుంచి సర్వే ప్రారంభమైంది. కాగా మొదటి రోజు 7,771 కుటుంబాలు, రెండో రోజు 11,986 కుటుంబాలను ఎన్యూమరేటర్లు సర్వే చేశారు. సర్వే 13 రోజులపాటు అంటే ఈనెల 18 తేదీ వరకు చేపట్టనుండగా.. ఇలాగే కొనసాగితే గడువులోపు పూర్తవుతుందా.. అనే సందేహాలు కలుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,63,362 కుటుంబాలుండగా.. సర్వే చేసేందుకు ప్రభుత్వం 2024 మంది ఎన్యూమరేటర్లను, వారిని పర్య వేక్షించేందుకు 208 మంది సూపర్వైజర్లను నియమించింది. ఒక్కో ఎన్యూమరేటర్ 150కిపైగా కుటుంబాలకు సంబంధించిన సర్వే చేయనున్నారు. కాగా ఒక్కో ఎన్యూమరేటర్ ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతున్నది. కుటుంబ యజమానులు లేకుంటే మళ్లీ ఆ ఇండ్లకు వెళ్లి సర్వే చేయాల్సిందే.
సర్వే మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నది. సర్వే ఫారంలో 75 ప్రశ్నలుండగా..ప్రతి అంశానికి సంబంధించి కోడ్ వేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో అధికారులు ఔట్సోర్సింగ్ విధానంలో కొంతమంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. వారికి శిక్షణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వే ఫారంలోని ఖాళీలను నింపడంలో గందరగోళానికి గురవుతున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 కుటుంబాల పైగానే కేటాయింపులు జరపడం సరికా దని, 100 నుంచి 120 కుటుంబాలు కేటాయిస్తే సకాలంలో సర్వే పూర్తి అయ్యే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా సర్వే ఫారాలూ కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అందలేదు. ఐదు రోజులకు సరిపడా ఫారాలు అందించామని, వాటిని పూర్తి చేయకముందే మిగతా ఫారాలను పంపిణీ చేస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను చెప్పడంలేదని సమాచారం. ఆస్తులు, ఆదాయం అధికంగా ఉన్నట్లు తెలిస్తే ఉన్న రేషన్‌కార్డులు పోతాయేమోనని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందవేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తమ ఆస్తులు సర్కారుకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో ఆదివారం కూడా కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు చేపట్టారు. ఉదయం నుంచే ఇండ్లకెళ్లి వివరాలు సేకరించారు. కొంతమంది వివరాలు ఇచ్చేం దుకు ఇష్టపడలేదు. జిల్లాలో 13 మున్సిపాలిటీలుండగా.. ఆ ప్రాంతాల్లో వలసవాదులు, అద్దెకుంటున్న వారే అధికంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన వారు అబ్దుల్లాపూర్‌మెట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, శంషాబాద్, ఆమనగ ల్లు వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎన్యూమరేటర్లు ఇండ్ల యజమానుల వివ రాలు తీసుకుంటూ అద్దె కుంటున్న వారి గురించి ఆరా తీయకపోవడంతో వారు తమ సమాచారాన్ని ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో రెండురోజులు గడిచినా వెయ్యి ఇండ్ల సర్వే కూడా పూర్తి కాలేదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సుమారు 8000 ఇండ్లు ఉండగా రెండురోజుల్లో 600 ఇండ్లు కూడా పూర్తి కాలేదు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 11,000 ఇండ్లు ఉండగా రెండు వేలూ పూర్తి కాలేదు. ఇలా అయితే సర్కార్ నిర్దేశించిన గడువు లోపు సమగ్ర కుటుంబ సర్వే పూర్తి కావడం గగనమే.
సర్వేకు సహకరించాలి..
వికారాబాద్, నవంబర్ 10 : ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వేను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సుధీర్, ఎంపీవో, ఇతర అధికారులున్నారు.
రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలి..; -నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్
సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలని రం గారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో సర్వే చేపట్టేందుకు 5,376 మంది ఎన్యూ మరేటర్లను నియమించినట్లు తెలిపారు. అధికారులు వచ్చినప్పుడు కుటుంబ పెద్ద తమ ఆధార్, రేషన్‌కార్డులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోజువారీగా వచ్చే డేటాను కంప్యూటర్లో ఎంట్రీ చేయిస్తామన్నారు.