Aziz Nagar | మొయినాబాద్, మార్చి21 : ఇంటి యాజమానులు మార్చి చివరి నాటికి ఇంటి పన్నులు చెల్లించకుంటే పెనాల్టితో చెల్లించాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ ఖాజామొయిజూద్దీన్ హెచ్చరించారు. శుక్రవారం అజీజ్‌నగర్‌లోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఇంటి పన్నులు వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31 వరకు ఇంటి పన్ను చెల్లించకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెనాల్టితో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అదనపు భారం పడకుండ ఉండాలంటే ఇచ్చిన గడువు లోపు పన్నులు చెల్లించాలని సూచించారు. మున్సిపాలిటి పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న మున్సిపాలిటి కార్యాలయాల్లోనికి వెళ్లి ఇంటి పన్నులు చెల్లించాలని చెప్పారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కావాల్సి ఉంటుందని, ప్రధానంగా మంచినీటి సమస్య నివారణకు వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ద్య నిర్వాహణ పనులు చేపట్టాలంటే ఖచ్చితంగా నిధులు కావాలని సూచించారు. ఇంటి యాజమానులు తప్పకుండ పన్నుల చెల్లింపులో సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నామని తెలిపారు.