షాద్‌నగర్, ఫిబ్రవరి 5 : అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పేద ప్రజలు కంటి వెలుగు శిబిరాల వద్ద ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యుల బృందం నిత్యం వైద్య పరీక్షలు చేస్తూ తగిన సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఉచితంగా కండ్ల అద్దాలు, మందులను అందజేస్తున్నారు. కంటి వెలుగు ప్రారంభం నుంచి నేటి వరకు వేలాది మంది సామాన్య ప్రజలు కంటి వైద్యాన్ని ఉచితంగా పొందారు. ఫలితంగా వేల రూపాయలను ఆదా చేసుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
6 మండలాల్లో 13,433 మందికి పరీక్షలు
షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బూర్గుల, చించోడు, కొందుర్గు, కేశంపేట, కొత్తూరు, నందిగామ పీహెచ్‌సీల ఆధ్వర్యంలో నిత్యం 10 వైద్య బృందాలు కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నాయి. కంటి వైద్య నిపుణులతో పాటు ఇతర వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్ద ఆయా ప్రాంతాల ప్రజలకు కంటి పరీక్షలను చేస్తున్నారు. గడిచిన 11 రోజుల్లో 13,433 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,332 మందికి ఉచితంగా కండ్ల అద్దాలను అందజేశారు. మరో 7, 164 మందికి మందులను అందజేశారు. నిత్యం వైయ్యి మందికిపైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కంటి వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తు తగిన సలహాలు సూచనలు చేస్తున్నారు. కంటి వైద్య శిబిరాలను స్థానిక వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు.
విజయవంతంగా కొనసాగుతున్నది
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు విజయవంతగా కొనసాగుతున్నది. మొదటి విడుతతో పోలిస్తే రెండో విడుతలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. వైద్య శిబిరాల వద్దకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షల్లో ఎలాంటి సమస్యలను గుర్తించిన వెంటనే ఉచితంగా మందులను ఇస్తున్నాం. కండ్ల అద్దాలను ఉచితంగా ఇస్తున్నాం. ఆపరేషన్లు అవసరమైనవారికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్. జయలక్ష్మి, ఏడీఎంహెచ్‌వో, షాద్‌నగర్