షాబాద్, ఏప్రిల్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డిజిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 12,631 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 725 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
595 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా కంటి అద్దాలతోపాటు, మందులు అందజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ప్రజలు చెబుతున్నారు. కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
290 గ్రామాలు, 58 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చేవారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.
ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 5064 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 705 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 726 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 290 గ్రామాలు, 58 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.