రంగారెడ్డి, జనవరి 15 (నమస్తేతెలంగాణ) : ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు డ్రా పద్ధతిన ప్లాట్లు కేటాయించడానికి సర్వం సిద్ధమైంది. ఎకరాకు 120 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఫార్మా రైతులకు గతంలోనే అప్పటి ప్రభుత్వం ప్లాట్ల సర్టిఫికెట్లనూ అందజేసింది. సర్టిఫికెట్లు అందుకున్నవారికి త్వరలోనే డ్రా పద్ధతిన ప్లాట్లు కేటాయించడంతో పాటు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం ఫార్మాలో భూములు కోల్పోయిన రైతుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల్లో నోటీసు బోర్డుపై పెట్టారు.
ఫార్మా భూములు కోల్పోతున్న రైతుల పేర్ల లిస్టులో ఏమైనా అవకతవకలు ఉంటే వారం రోజుల్లోపు అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తూ గత శుక్రవారం ఆయా గ్రామపంచాయతీల్లో నోటీసు బోర్డులపై జాబితాను అంటించారు. అభ్యంతరాలకు సంబంధించి గడువు గురువారంతో ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలుంటే మరో రెండురోజులు పరిశీలన జరిపి డ్రా పద్ధతిన ప్లాట్ల నంబర్లు కేటాయించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందుకోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల్లో గతవారం రోజులుగా లిస్టులను ప్రదర్శించారు. అలాగే, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, బేగరికంచ, పంజాగూడ, అన్నోజిగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడం గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ ఆయా గ్రామపంచాయతీల్లో రైతుల పేర్ల జాబితాను అందుబాటులో ఉంచారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా బాధిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందడంతో పాటు ఇంటి స్థలాలు కూడా అందుతున్నాయి.
ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు. యాచారం మండలంలో మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో మొత్తం 979 మంది రైతులు ఉన్నారు. కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట్, బేగరికంచ, పంజాగూడ, అన్నోజిగూడ, సాయిరెడ్డిగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి గ్రామాల్లో మొత్తం 868 మంది రైతులు ఉన్నారు.