వికారాబాద్ జిల్లాలో ‘కడుపుకోత’లు జోరు గా సాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి సిజేరియన్లకు తెగబడుతున్నా యి. సాధారణ కాన్పులకు అవకాశమున్నా.. ఏదో ఒక సాకు చెబుతూ అందినకాడికి దండుకుంటున్నాయి. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని.. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నాయి.
-వికారాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)
దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు. డెలివరీ కోసం ప్రైవేట్ దవాఖాన తలుపు తడితే చాలు.. సిజేరియన్లు చేసేస్తున్నారు. అవసరం లేకపోయి నా కాసుల కోసం ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో 50 వరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లున్నాయి. వాటిలో మెడికల్ షాపులను అనుబంధంగా నడుపుతూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు.
అత్యాధునిక వైద్య సేవలంటూ రోగులను ఆకర్షిస్తూ ఒక్కో సీజేరియన్‌కు రూ. 80,000 నుంచి రూ.లక్ష వరకు లాగుతున్నారు. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో జరిగే ప్రసవాల్లో దాదాపు 90 శాతం మేర ‘కడుపు కోత’లేనని వైద్యారోగ్యశాఖ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా తెలుస్తున్నది. అదే సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో జరిగే డెలివరీల్లో 20-30 శాతం ప్రసవాలు సిజేరియన్లు ఉంటున్నాయి.
జిల్లా పరిధిలో 50 వరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లుం డగా.. సీటీస్కాన్, స్కానింగ్, ఎక్స్‌రే సెంటర్లు, ల్యాబ్‌లు కలిపి 20 వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో మెడికల్ స్టోర్ ఉండగా.. వాటిని ఆయా దవాఖానల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. ఈ దవాఖానలకు ఆర్ఎంపీ, పీఎంపీలు మధ్యవర్తులుగా పనిచేస్తున్నారు. వారితోపాటు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ డం, పత్రికలు, టీవీలు, సినిమా థియేటర్లలో ప్రకటనలు ఇవ్వడం, గ్రామాల్లో ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువవుతూ వారికి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
తమ దవాఖానకు వస్తే అత్యాధునిక సేవలు అందిస్తామని నమ్మబలుకుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు ఒకటో నెల నుంచి మొదలుకొని తొమ్మిదో నెల వచ్చే వరకు ప్రతినెలా స్కానింగ్‌లు, పరీక్షలు చేస్తున్నారు. తల్లి గర్భంలో పిండం కాస్త కదిలితే చాలు స్కానింగ్ తీస్తున్నారే ఆరోపణలు ఉన్నారు. తక్కువలో తక్కు వ ప్రతినెలా రూ. 3,000 నుంచి రూ. 5,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. డెలివరీ కోసం నిండు గర్భిణి హాస్పిటల్లో అడుగు పెడితే కోతలేనిదే బయటికి పంపించడం లేదు.
విచ్చలవిడిగా ఆపరేషన్లు..
ప్రైవేట్ దవాఖానలకు వెళ్లిన గర్భిణులకు విచ్చలవిడిగా ఆపరేషన్లు చేస్తున్నారు. స్కానింగ్ తీయడం, బిడ్డ అడ్డం తిరిగిందని, రక్తం తక్కువగా ఉందని, పేగులు మెడకు చుట్టుకున్నాయని, ఆపరేషన్ చేయకుంటే తల్లికి బిడ్డకు ప్రమాదం అని రకరకాల కారణాలు చెప్పి గర్భిణులు, వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేస్తూ డాక్టర్లు తమకు తాముగా డిమాండ్ పెంచుకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో గడిచిన ఏడాదిలో 3,828 ప్రసవాలు జరుగగా వాటిలో 3,193 డెలివరీలు సిజేరియన్లే. సాధారణ ప్రసవాలు కేవలం 635 మాత్రమే. ఇదే క్రమంలో ప్రభుత్వ దవాఖానల్లో గతేడాదిలో 9,361 ప్రసవాలు జరుగగా ..వాటిలో 3,348 ప్రసవాలు కడుపుకోత ఆపరేషన్లు కాగా.. 6,003 సాధారణ ప్రసవాలు నమోదయ్యాయి.
ప్రైవేట్ దవాఖానలకు డెలివరీ కోసం వెళ్తే బిల్లుల మోత మోగుతున్నది. గర్భిణులు ఆస్పత్రిలో అడుగు పెట్టగానే ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ. 4,000, మత్తు మందు వైద్యుడి పేరుతో రూ.2,000 నుంచి రూ.3,000 వరకు, ఆపరేషన్ మెడిసిన్ కిట్‌కు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జీ రోజు వరకు బెడ్చార్జి, రూమ్ సర్వీస్, సర్వీస్ చార్జీలు, ఆస్పత్రి మెయింటెనెన్స్, పవర్ బిల్లు ఇలా అన్ని కలిపి రూ. 60,000 నుంచి రూ.80,000 సమర్పించుకోనిదే తల్లీ బిడ్డ ప్రైవేట్ దవాఖానల నుంచి ఇంటికి చేరే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాల శాతం చాలా తక్కువ అయినా బిల్లుల వసూలు మాత్రం తగ్గడం లేదు.
నార్మల్ డెలివరీ అయ్యే గర్భిణులకూ ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ. 5,000, మెడిసిన్ చార్జీలు రూ.3,000, రూ. 5,000 ఇతరత్రా ఖర్చులు అవుతున్నాయి. మెయింటెనెన్స్, రూమ్ సర్వీస్, బెడ్ చార్జి, ఇతరత్రా అన్ని చార్జీలు కలిపి రూ.50,000 బిల్లు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌లో జరుగుతున్న సీజేరియన్ల దందాపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలు అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుని.. సామాన్యుడికి వైద్యం చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.