రంగారెడ్డి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): మూడు విడుతల్లో రుణమాఫీ ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. అయితే మొదటి, రెండవ విడుతల్లో రుణమాఫీని మొక్కుబడిగా పూర్తిచేసిన ప్రభుత్వం మూడో విడుతను సైతం ప్రహసనంగా చేసింది. ఆగస్టు 15న నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. సెలవు కావడంతో అదే రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అయితే రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం కూడా అదే పరిస్థితి నెలకొన్నది. సాయంత్రానికి కూడా ఎంతమంది రైతులకు మూడో విడుత రుణమాఫీ అయ్యిందో అధికారులు చెప్పలేకపోయారు. సంబంధిత జాబితా రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. అరకొరగా మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులుదులుపుకొన్నదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ మాటేమోగానీ.. వానకాలం సాగు పనులను సైతం వదులుకుని వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్త్తుందని రైతాంగం విసుగు చెందుతున్నది.
అంతుబట్టని మాఫీ..
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,700మంది రైతులకు రూ.258.18కోట్ల రుణమాఫీ, రెండో విడుతలో 22,915 మంది రైతులకు రూ.218.12కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మూడో విడుతలో కేవలం 11వేల మందితోనే రూ.2లక్షల మాఫీని సరిపెట్టినట్లు తెలుస్తున్నది. ఈ లెక్కన మూడు విడుతల్లో కలిపి జిల్లావ్యాప్తంగా 80వేల పైచిలుకు మంది రైతులకే రుణమాఫీ చేసి మమ అనిపించినట్లు తెలుస్తున్నది. రుణమాఫీల్లో నేటికీ చిక్కుముడులు వీడడం లేదు. రుణమాఫీ ప్రక్రియలో సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అర్హులైనవారికీ రుణమాఫీ ఎందుకు కాలేదో అంతుబట్టడం లేదు. ప్రభుత్వం రూపొందించిన ఉత్తర్వుల మేరకు పట్టా పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ తొలివిడుతలో రూ.లక్ష వరకు, రెండవ విడుతలో లక్షన్నర వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలి. కానీ.. బ్యాంకులు పంపిన జాబితాలో ఉన్న రైతుల్లో చాలామందికి మాఫీ జమకాకపోవడంపై గందరగోళం నెలకొన్నది.
ఇందుకు అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ఖాతాల్లో పేర్లకు, ఆధార్‌కు మధ్య తేడా కారణంగానే మాఫీ డబ్బులు జమకాలేదని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డులో పేరులేకపోతే కూడా రుణమాఫీ డబ్బులు పడలేదు. దీంతో జాబితాలో పేరున్నప్పటికీ రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాలేదు. మొదటి విడుతలో 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28కోట్లకు పైగా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. సంబంధిత రైతుల వివరాలను సేకరించి రాష్ట్రస్థాయి అధికారులకు పంపించామని జిల్లా అధికారులు చెబుతున్నారు. కానీ.. ఇప్పటివరకు ఎంత మంది రైతులకు న్యాయం జరిగిందో స్పష్టత లేదు. ఇక రెండో విడుతలోనూ 194 మంది రైతులకు సంబంధించి రూ.1.50కోట్లు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నది. వివిధ కారణాలతో జమకాలేదని అధికారులు చెబుతున్నారు. జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాకపోవడంపై రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొన్నది. ఇదే క్రమంలో మూడో విడుత జాబితా సందర్భంగానూ రైతుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
అందరికీ న్యాయమంటూ బుకాయింపు..
రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు తెలిపేందుకు ప్రభుత్వం ఏవో, ఏఈవోలకు ప్రత్యేక యాప్‌లను ఇచ్చింది. రైతుల ఆధార్‌కార్డు ఆధారంగా అధికారులు మాఫీ కాకపోవడానికి గల కారణాలను చెబుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని రైతులకు సర్దిచెప్పి పంపిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే.. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయమని సలహా ఇస్తున్నారు. మరో జాబితాలో న్యాయం జరుగుతుందని బుకాయిస్తున్నారు. అధికారులు ఎంతగా సర్దిచెబుతున్నప్పటికీ రైతుల్లో మాత్రం అనుమానాలు తీరడం లేదు.
వ్యవసాయ శాఖలో జరుగుతున్న బదిలీల నేపథ్యంలోనూ అధికారుల నుంచి సమాధానాలు కరువవుతున్నాయి. ఇటీవల వ్యవసాయ శాఖలో బదిలీలు జరగగా.. రుణమాఫీ ప్రక్రియ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే మూడో విడుత రుణమాఫీని ప్రకటించిన మరుసటి రోజుననే శుక్రవారం బదిలీలు అయినవారందరినీ రిలీవ్ చేయాలని ఆఘమేఘాల మీద ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం జిల్లాలో ఏవో, ఏఈవోల బదిలీలతోనే సరిపోయింది. దీంతో రుణమాఫీ కాలేదని కార్యాలయాలకు వచ్చిన రైతులకు సమాధానం చెప్పేవారే లేకుండా పోయారు. వానకాలం సాగు సీజన్లో బిజీగా ఉండే రైతులు పనులు వదులుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులతో తల్లడిల్లిపోతున్నారు.