తాండూరు రూరల్, నవంబర్ 15 : రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు. రాయల్కాంట నుంచి మసీద్ వరకు ఉన్న రోడ్డు ధ్వంసమై అధ్వానంగా మారింది. దీనిపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో ప్రభుత్వం ఆరు నెలల కిందటే నిధులను కూడా విడుదల చేసింది.
అయినా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆ పనులు ఇంకా మొదలు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు శనివారం ఆందోళన చేపట్టారు. తామే రోడ్డును వేసుకుంటామంటూ జేసీబీతో రోడ్డును తవ్వించారు. ఈ విషయం తెలుసుకున్న లోకల్ నాయకుడు నర్సింహులు మున్సిపల్ కమిషన్ యాదగిరికి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. నిధులు మంజూరైనా ఎందుకు రోడ్డు వేయడంలేదని కాలనీవాసులు అధికారులను నిలదీశారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.