పరిగి, ఏప్రిల్ 20 : వికారాబాద్ జిల్లాలో ఉచిత డయాలసిస్ సేవలను విస్తరించే దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇపట్పికే జిల్లా కేంద్రంతో పాటు తాండూరులోని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తుండగా.. ఎంతోమంది పేదలకు వరంగా మారాయి. ప్రస్తుతం రెండు కేంద్రాల్లో కలిపి మొత్తం 13 యంత్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. అయితే రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో ఐదు యంత్రాలు, పడకల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ నెలాఖరులోపు ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది. అలాగే కొడంగల్‌లో కొత్తగా మరో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మెరుగైన వైద్యం, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, డయాలసిస్ కేంద్రాలతో ఆరోగ్య సేవలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు విస్తరించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. గతంలో డయాలసిస్ చేయించుకునే వారికి ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిసారికి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం డయాలసిస్ చేయించుకునే వారి కోసం జిల్లాల్లోనే డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే తాండూరు జిల్లా దవాఖాన, వికారాబాద్‌లోని దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి.
వాటిలో సేవలు అందిస్తుండగా ఉన్న వాటిలో సేవల విస్తరణకు, అలాగే కొత్త డయాలసిస్ సెంటర్ల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు లోపు ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోనున్నట్లు సమాచారం. తద్వారా మరింత మంది డయాలసిస్ రోగులకు సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతున్నది. కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులకు వారానికి రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. కొత్త మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న సెంటర్లలో అదనపు బెడ్స్‌కు అవకాశం ఉన్నది.
రెండు కేంద్రాల్లో అందుతున్న సేవలు..
వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్ దవాఖానల్లోని డయాలసిస్ సెంటర్లలో సేవలు నిత్యం అందుతున్నాయి. వికారాబాద్‌లోని సర్కారు దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో 5 బెడ్స్, 5 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 5 షిఫ్ట్‌లుగా 24 గంటలపాటు 25 మందికి డయాలసిస్ చేస్తారు. ఒకరోజు తప్పించి ఒకరోజు డయాలసిస్ చేస్తుండడంతో వికారాబాద్ దవాఖానలో 50 మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తారు. తాండూరులోని జిల్లా దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో 8 బెడ్స్, 8 డయాలసిస్ మిషన్ల ద్వారా ప్రస్తుతం సేవలు అందుతున్నాయి.
ఇక్కడ రోజుకు 4 షిఫ్ట్‌ల్లో 32 మందికి, మొత్తం 69 మందికి డయాలసిస్ చేస్తున్నారు. హెపటైటిస్ బి తదితర వ్యాధులతో బాధపడే వారికి సైతం డయాలసిస్ చేస్తుండడంతో కేవలం నాలుగు షిఫ్ట్ల్లోనే సేవలు అందిస్తున్నారు. సుమారు 4 గంటలపాటు యంత్రాలను శుభ్రం చేయడం వంటి వాటికి సరిపోతుంది. జిల్లా పరిధిలో రెండు కేంద్రాల్లోనే డయాలసిస్ సదుపాయం ఉండగా రోగుల సంఖ్య సైతం పెరుగుతున్నది. వికారాబాద్ కేంద్రంలో మరో 8 మంది, తాండూరులో 10 మందికి పైగా డయాలసిస్ రోగులు వెయిటింగ్లో ఉన్నట్లు తెలిసింది. జిల్లా వాసులకు ఇక్కడే డయాలసిస్ సేవల కోసం వికారాబాద్‌లో 3 బెడ్స్, 3 డయాలసిస్ యంత్రాలు, తాండూరులో 2 అదనపు బెడ్లు, డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఏప్రిల్ నెలాఖరు లోపు అదనపు బెడ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కొత్తగా డయాలసిస్ కేంద్రాలు..
వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం రెండు డయాలసిస్ సెంటర్లు ఉండగా కొత్తగా కొడంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా కనీసం అయిదు బెడ్స్, 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసినా ఇక్కడ 50 మంది వరకు డయాలసిస్ చేసే అవకాశం ఉంటుంది. కొడంగల్‌లో నూతనంగా నిర్మాణం పూర్తయిన భవనంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతోపాటు పరిగి పట్టణంలో సైతం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉన్నది. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పరిగి నూతన దవాఖాన భవనంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా పరిగి ప్రాంత డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బందులు తీరుతాయి.
లేనియెడల వారు వికారాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొత్తగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండడంతో పరిగి కేంద్రం విషయమై ఎమ్మెల్యే మరోసారి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్‌రావును కలిసి విన్నవించనున్నట్లు తెలిసింది. పరిగికి సైతం డయాలసిస్ సెంటర్ మంజూరు చేస్తే జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు కేంద్రాల ద్వారా డయాలసిస్ సేవలు అందించే అవకాశాలు ఏర్పడుతాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓవైపు ఇప్పటివరకు ఉన్న కేంద్రాల్లో బెడ్ల సంఖ్య పెంచేందుదుకు ప్రతిపాదనలు, కొత్త సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు సఫలీకృతమైతే డయాలసిస్ రోగులకు సేవలు విస్తరించబడుతాయని చెప్పవచ్చు.