వికారాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా నిరసనలు జరుగకుండా సోమవారం రాత్రి నుంచే ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అరెస్ట్ చేసిన దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులతోపాటు బీఆర్ఎస్, సీపీఎం నేతలు, ప్రజాసంఘాల నాయకులను కులకచర్ల, పరిగి, వికారాబాద్, కోట్‌పల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మోమిన్‌పేట మండలంలో అంత్యక్రియలకు వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను మోమిన్‌పేట మండలం చీమలదరిలో పోలీసులు అదుపులోకి తీసుకుని మోమిన్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా దామగుండం పరిసర గ్రామాలు, తండాల ప్రజలను గృహ నిర్బంధం చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసే వరకు వారి అవసరాల కోసం కూడా బయటకు రానివ్వకుండా పోలీసులు బెదిరించి గృహ నిర్బంధం చేయడంపై ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దామగుండం అడవిని నాశనం చేసే రాడార్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ వికారాబాద్, తాండూరులలో బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్తోపాటు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, కౌన్సిలర్ కిరణ్ పటేల్, బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, నాయకులు సురేశ్‌గౌడ్, కేదార్నాథ్, ప్రభాకర్ రెడ్డి, రంజిత్, మణికంఠ తదితరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
రాడార్ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను వల్లె వేశారు. రాడార్ కేంద్రానికి భూములు కేటాయించారంటూ, లక్షల చెట్లు తొలగించనున్నారని ప్రచారం చేస్తున్నారని, రాడార్ కేంద్రం ఏర్పాటును వివాదం చేస్తున్నారని సీఎం బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. అంతేకాకుండా పర్యావరణ ప్రేమికులపైనా దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ విషయమై ఆలోచిస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉన్న దామగుండం అడవిని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు రాడార్ కేంద్రం ఏర్పాటుకు అడుగు ముందుకు వేయలేదు. మూసీ, ఈసీ నదుల మనుగడ ప్రమాదంలో పడనున్నదని, జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడనున్నదని, రేడియేషన్ ప్రభావంతో స్థానిక ప్రజలకు ముప్పు వాటిల్లనున్నదని గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేశారు. మరోవైపు రాడార్ ఏర్పాటుతో దామగుండంలో తొలగించే చెట్ల విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టింది. రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే దామగుండం అడవిలోని 12 లక్షల చెట్లు తొలగించాల్సి ఉంటుందని మొదట చెప్పిన అటవీ శాఖ అధికారులు.. ప్రకృతి ప్రేమికులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడంతో తర్వాత మాట మార్చారు. అమెరికాలాంటి దేశాలే ఈ రాడార్ ప్రాజెక్టు దుష్పరిణామాలు గుర్తిస్తే, మన ప్రజాప్రతినిధులు మాత్రం వాటిని పట్టించుకోకపోవడం వివాదాలకు తావిస్తున్నది. రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే రేడియేషన్ ప్రభావంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నదని స్థానికులు భయాందోళనకు గురవుతున్నా సమావేశంలో ప్రజల సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం జరుగలేదని పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తున్నది..
ఇది ప్రజా పాలన కాదు.. నిర్బంధ పాలన.. ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా దామగుండం అటవీ ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి నేవీ రాడార్‌కు శంకుస్థాపన చేయడం ఏమిటీ ?.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, తండావాసులు బయటికి రాకుండా గృహ నిర్బంధం చేసి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు. నియోజకవర్గంలోని వ్యక్తి మృతి చెందితే వెళ్తున్న మాజీ మంత్రి సబితారెడ్డిని అడ్డుకోవడం దుర్మార్గపు చర్య.. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్నది.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
నిజాలను దాయలేరు..
తెలంగాణలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన సాగుతున్నది. రాడార్ శంకుస్థాపన కార్యక్రమానికి నిర్బంధాలు చేస్తుంటే జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, చుట్టుపక్కల గ్రామాల జనాలను గృహ నిర్బంధాలు చేయడం వంటివి చూస్తున్న జనం ఇదేమి పాలన దేవుడా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను నిర్బంధ తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రం శంకుస్థాపనను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలను ధరించి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు నిరసన తెలిపారు.
– శుభప్రద్ పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు